అమెరికా, రష్యాలతో పోలిస్తే చైనా దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి?

ఫొటో సోర్స్, Sheng Jiapeng/China News Service/VCG via Getty Images
- రచయిత, టామ్ లామ్
- హోదా, బీబీసీ మానిటరింగ్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
చైనా తన అణ్వాయుధాల సంపత్తి, వారి వ్యూహం విషయంలో చాలా రహస్యంగా వ్యవహరిస్తోంది.
తన అణు విధానం ప్రాథమికంగా ఆత్మరక్షణ కోసమేనని ఆ దేశ అధికారిక వైఖరి తెలియజేస్తోంది.
'ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించం' (నో ఫస్ట్ యూజ్) అనే విధానాన్ని అది నిరంతరం నొక్కిచెబుతోంది.
కానీ అదే సమయంలో, త్రైపాక్షిక అణ్వాయుధ నియంత్రణ చర్చలలో అమెరికా, రష్యాలతో కలిసి చేరాలనే ఆహ్వానాన్ని చైనా తిరస్కరిస్తోంది కూడా.
ఇటీవల సంవత్సరాల్లో చైనా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని వేగంగా ఆధునీకరించుకుందని పశ్చిమ దేశాల నిపుణులు అంటున్నారు.

ఆ దేశాల అంచనాల ప్రకారం.. 2023 నుంచి 2025 మధ్య కాలంలో.. చైనా ఒక్కో ఏడాదికి సుమారు 100 కొత్త అణ్వాయుధాలను సమకూర్చుకుంది. అయితే, గత ఏడాది కాలంగా, ఈ పెరుగుదల కాస్త తగ్గి, 20కి చేరింది.
పశ్చిమ దేశాల మీడియా కథనాల ప్రకారం, చైనా తన మిసైల్ సైలో వ్యవస్థను కూడా గణనీయంగా బలోపేతం చేసుకుంది.
''సెకండ్ స్ట్రైక్ ''ను అంటే ప్రతీకార అణుదాడిని చేపట్టేందుకు తన సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడమే చైనా ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
మిసైల్ సైలో అంటే.. భూగర్భంలో నిర్మించిన క్షిపణి ప్రయోగ కేంద్రం.
దీనిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు లేదా మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేయడానికి, ప్రయోగించడానికి ఉపయోగిస్తారు.
తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు బీజింగ్ ఏమాత్రం జంకడం లేదు. 2024లో బీజింగ్ తన నిరాయుధ ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించింది.
రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించిన వార్షికోత్సవాల కోసం 2025లో ఒక పరేడ్‌ను నిర్వహించింది. ఇందులో తొలిసారి 'న్యూక్లియర్ ట్రయాడ్'ను ప్రదర్శించింది. దీనిలో భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయి.
దీనిలో భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, GREG BAKER/AFP via Getty Images)
చైనా తన అణు విధానంపై ఏం చెబుతోంది?
బీజింగ్ తన తన అణ్వాయుధాల సంపత్తిపై ఎక్కువ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించడం లేదు.
తమ అణ్వాయుధ విధానం '' స్థిరంగా, నిలకడగా, ఆచరణాత్మకంగా'' సాగుతుందని మాత్రం అధికారికంగా తెలిపింది. ప్రధానంగా ఆత్మ రక్షణ కోసమే ఇది అవసరమని నొక్కి చెప్పింది.
కనీస స్థాయిలోనే తన అణ్వాయుధాలు ఉంచుకున్నామని, అంటే, తమ దేశ భద్రతకు అవసరమైనంతేనని చైనా పదేపదే చెబుతోంది.
తాము అణ్వాయుధ పోటీలో ఎన్నడూ పాల్గొనలేదని, ప్రపంచ వ్యూహాత్మక సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషించామని కూడా అది నొక్కి చెబుతోంది.
చైనా తన అణ్వాయుధాగారాన్ని వేగంగా విస్తరిస్తోందన్న ఆరోపణలను "నిరాధారమైన ఊహాగానాలు, ప్రచారం" అని కొట్టిపారేసింది.
చైనా కూడా మొదట అణ్వాయుధాలను వాడకూడదనే విధానాన్నే (''నో ఫస్ట్ యూజ్'' పాలసీని) తరచూ ప్రోత్సహిస్తోంది.
2024లో చైనా అణ్వాయుధాల కోసం ''నో ఫస్ట్ యూజ్'' (ఎన్ఎఫ్యూ) విధానాన్ని తీసుకొచ్చింది. అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్పీటీ) అమలు దిశగా ఇదొక ఆచరణాత్మక అడుగుగా అభివర్ణించింది.
ఎన్ఎఫ్యూ విధానాన్ని అవలంబించాలని ఇతర అణ్వాస్త్ర దేశాలను చైనా కోరింది. అంతేకాకుండా, అణ్వాయుధాలు లేని దేశాలపై ఈ ఆయుధాలను ఉపయోగించకూడదని లేదా ఉపయోగిస్తామని బెదిరించకూడదని తెలిపే ఒప్పందంలోకి ఆ దేశాలు రావాలని ప్రతిపాదించింది.
అయితే.. వాషింగ్టన్, మాస్కోతో త్రైపాక్షిక ఆయుధ నియంత్రణ చర్చలలో పాల్గొనాలనే అమెరికా ప్రతిపాదనను మాత్రం బీజింగ్ పదేపదే తిరస్కరిస్తోంది.
అమెరికా-రష్యా మధ్య కుదిరిన సరికొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందానికి (ఎస్టీఏఆర్టీ) ఫిబ్రవరిలో కాలం తీరనున్న నేపథ్యంలో ఈ డిమాండ్ మరింత పెరిగింది.
ఈ డిమాండ్లు "సహేతుకమైనవి కావు, అనవసరమైనవి, ఆచరణ సాధ్యం కానివి" అని చైనా అధికారులు అభివర్ణించారు.
ప్రపంచంలోని అణ్వాయుధాలలో అధిక భాగం అమెరికా, రష్యాల వద్ద ఉన్నాయని, అందువల్ల నిరాయుధీకరణకు ప్రాథమిక బాధ్యత ఈ రెండు దేశాలదేనని చైనా అధికారులు వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, GLOBAL TIMES
పశ్చిమ దేశాల నివేదికలు ఏం చెబుతున్నాయి
చైనా గోప్యత పాటిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో చైనా తన అణ్వాయుధ సామర్థ్యాలను వేగంగా ఆధునీకరిస్తుందని పశ్చిమ దేశాల నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ భద్రత సంస్థ ఎస్ఐపీఆర్ఐ (సిప్రి) 2026 నివేదిక ప్రకారం.. 2026 జనవరి వరకు.. చైనా వద్ద న్యూక్లియర్ వార్హెడ్లు సుమారు 620 ఉన్నాయి. ఈ సంఖ్య గతేడాది 600.
ఎస్ఐపీఆర్ఐ ప్రకారం.. 2023 నుంచి 2024 మధ్య కాలంలో చైనా తన ఆయుధ నిల్వలలో 90 వార్హెడ్లను పెంచుకుంది. 2024 నుంచి 2025 మధ్య కాలంలో ఈ సంఖ్యను మరో 100 పెంచుకుంది.
గత పదేళ్లలో ఇది చాలా వేగవంతమైన పెరుగుదల. కానీ, ఇప్పుడు ఈ వేగం కాస్త నెమ్మదించింది.
2030 నాటికి చైనా వద్ద అణ్వాయుధాలు 1000కి పైగా ఉండొచ్చని అమెరికా రక్షణ విభాగం తన 2024 నివేదికలో అంచనావేసింది.
2022 నివేదికలో 2035 నాటికి ఈ సంఖ్య 1500కి చేరుతుందని అంచనావేసింది. అయితే, ఈ అంచనాను 2024 నివేదికలో చేర్చలేదు.
చైనాలో అణ్వాయుధాల నిల్వల అంచనాలు

2030 నాటికి చైనాలో వెయ్యికి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ.. అమెరికా, రష్యాల వద్ద ప్రస్తుతమున్న అణ్వాయుధ నిల్వలతో పోలిస్తే కేవలం నాలుగో వంతు మాత్రమే దీనివద్ద ఉంటాయని సిప్రి తెలిపింది.
దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న మూడు అతిపెద్ద సైలో ప్రాంతాలకు వందల సంఖ్యలో క్షిపణులను చైనా మోహరించడంపై సిప్రి ఆందోళన వ్యక్తం చేసింది. అదేసమయంలో, ఈశాన్య పర్వత ప్రాంతాల్లో కొత్తగా 30 సైలోలను ఏర్పాటు చేసే పనిలో ఉంది చైనా.
చైనా వాయువ్య ప్రాంతమైన జిన్జియాంగ్ ఎడారిలో భారీ నిర్మాణాలను ఏర్పాటు చేశారని మే నెలలో రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
ఇక్కడ 80కి పైగా ప్రయోగ వేదికలు, పటిష్టమైన బంకర్లు, అక్టాగోనల్ కమాండ్ సెంటర్లు నిర్మించారు.
ఈ సన్నాహాలను సైలో-ఆధారిత, మొబైల్ క్షిపణులు రెండింటికీ మద్దతు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు.
ఇది చైనా ప్రతీకార అణుదాడిని లేదా "సెకండ్ స్ట్రైక్" సామర్థ్యం గణనీయంగా బలపడటాన్ని సూచిస్తుంది.

ఫొటో సోర్స్, Sheng Jiapeng/China News Service/VCG via Getty Images
అణు సామర్థ్యాల ప్రదర్శన
పశ్చిమ దేశాల డేటాపై చైనా ప్రభుత్వ మీడియా స్పందించనప్పటికీ, బీజింగ్ ఇటీవల ఏళ్లల్లో తన అణు సామర్థ్యాలను బహిరంగంగా ప్రదర్శిస్తోంది.
ఉదాహరణకు, 2024లో చైనా నిరాయుధ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించింది. 1980 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి.
అయితే, చైనా రక్షణ శాఖ దీనిపై తక్కువ సమాచారం అందించినప్పటికీ, హవాయి దీవులకు ఆగ్నేయంగా 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని డీఎఫ్-31ఏజీ క్షిపణి ఛేదించిందని చైనా మీడియా నివేదించింది.
ఈ క్షిపణి 12,000 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది.
దాని దాడి సామర్థ్యం ఎంతగా ఉందంటే... అది దక్షిణ ధ్రువం, యూరప్ ఖండం మొత్తం, అమెరికా పశ్చిమ తీరంలోని ప్రధాన నగరాలను కూడా చేరుకోగలదని మీడియా నివేదికలు తెలిపాయి.
ఈ ప్రయోగం ఉద్దేశ్యం వ్యూహాత్మక సందేశాన్ని చేరవేయడమేనని చైనా సైనిక నిపుణుడు డ్యూ వెన్లాంగ్ తెలిపారు. చైనాకు బలమైన లాజిస్టిక్స్, మ్యాపింగ్ సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
తమ క్షిపణులు ఎలాంటి వైమానిక రక్షణనైనా, క్షిపణి నిరోధక వ్యవస్థనైనా ఛేదించగలవనే విశ్వాసంతో చైనా ఉందని ఆ నిపుణుడు పేర్కొన్నారు.
ఇదే సమయంలో తైవాన్ సైనిక నిపుణులు మాత్రం ఈ పరీక్షను భిన్నమైన కోణంలో చూస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అవినీతికి వ్యతిరేకంగా ఒక అతిపెద్ద ఉద్యమం చేపట్టినప్పుడు ఈ పరీక్ష జరిగినట్లు తెలిపారు.
అదే సమయంలో రాకెట్ ఫోర్స్‌కు చెందిన చాలామంది సీనియర్ అధికారులను తొలగిస్తున్నారు.
(చైనా అణు వ్యూహాన్ని బీబీసీ పరిశీలిస్తోంది. ఈ పరిశీలనలో భాగంగా మేం అందిస్తున్న రెండు కథనాల్లో ఇదొకటి.)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























