ఉక్కపోతలో కూడా ఆదమరిచి నిదరోవాలంటే 10 చిట్కాలు

ఫొటో సోర్స్, Getty Images
ఎండాకాలం ఎయిర్ కండిషనర్(ఏసీ)వాడుతున్నవారి సంగతి సరే. కానీ లేనివారి పరిస్థితేంటి?
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు రాత్రిపూట చాలామందికి హాయిగా నిద్రపట్టకపోవచ్చు.
అలాంటివారికోసమే ఈ చిట్కాలు.
ఈ సూచనలు ప్రొఫెసర్ కెవిన్ మోర్గాన్, లీసా ఆర్టిస్ సూచనల ఆధారంగా రూపొందించారు.

1. మధ్యాహ్న నిద్ర వద్దు
వేడి వాతావరణం కారణంగా రోజులో కొంత అలసటగా, నిద్రమత్తుగా అనిపించవచ్చు. ఎందుకంటే బాడీ టెంపరేచర్ నియంత్రించడానికి మీ శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది.
కానీ రాత్రి నిద్ర బాగా రావాలంటే పగటిపూట నిద్రపోకూడదు. వేసవిలో పగటిపూట వచ్చే నిద్రమత్తును రాత్రి పడుకునే వరకు దాచుకోవడం మంచిది.
2. రొటీన్ పాటించండి
వాతావరణం వేడిగా ఉన్నాసరే మీ రోజువారీ పడుకునే సమయం, అలవాట్లు మార్చకండి. అలా చేస్తే నిద్ర చెడిపోతుంది.
3. గదిని చల్లగా ఉంచండి
పగటిపూట కర్టెన్లు మూసేయండి. సూర్యకాంతి రాకుండా చూడండి.
పడుకునే ముందు కిటికీలు తెరచి గాలి వచ్చేటట్టు చేయండి.

4. పలుచని బెడ్షీట్లు వాడండి
బెడ్షీట్లు తేలికగా ఉండేవి, కాటన్‌వి అయితే మంచిది. అవి చెమటను పీల్చుకుంటాయి.
రాత్రిపూట మీ బెడ్రూమ్లో ఎంత వేడి ఉన్నా, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందుకే కొన్నిసార్లు ఉదయం లేచేప్పుడు చలిగా అనిపిస్తుంది.
5. ఫ్యాన్ వేసుకోండి, సాక్స్‌ని ఫ్రిజ్‌లో పెట్టివాడండి
వేడి వాతావరణంలో, ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, చిన్న ఫ్యాన్ అయినా ఉపయోగపడుతుంది.
ఇది చెమట ఆవిరి కావడానికి సహాయపడుతుంది. దాంతో శరీరం తన ఉష్ణోగ్రతను సులభంగా నియంత్రించుకోగలదు.
ఫ్యాన్ లేకపోతే, హాట్ వాటర్ బాటిల్లో చల్లటి నీరు లేదా ఐస్ పెట్టి ఉపయోగించవచ్చు.
లేదా సాక్స్‌ను కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక వేసుకోవచ్చు. కాళ్లు చల్లగా ఉంటే శరీరం మొత్తం ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
6. హైడ్రేటెడ్‌గా ఉండండి
రోజంతా సరిపడా నీరు తాగాలి. కానీ పడుకునే ముందు ఎక్కువగా తాగకపోతేనే మంచిది.
ఇది సరైన సమతుల్యం పాటించడం కోసమే. ఎందుకంటే మీకు రాత్రిపూట దాహం వేయకుండా ఉండాలి, అలాగని బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం కూడా రాకూడదు.
7. పానీయాల విషయంలో జాగ్రత్త
సాఫ్ట్ డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా వాటిలో ఎక్కువ కెఫీన్ ఉంటుంది. అది నాడీ వ్యవస్థను ఉత్తేజపరచి నిద్ర పట్టకుండా చేస్తుంది.
వేడి వాతావరణంలో కొందరు మద్యం తాగుతారు. కానీ ఎక్కువగా తాగకూడదు.
మద్యం తాగితే నిద్ర పడుతుందని అనిపించవచ్చు, కానీ అది ఉదయాన్నే త్వరగా మేల్కోవడానికి, నిద్ర నాణ్యత తగ్గడానికి కారణమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
8. ప్రశాంతంగా ఉండండి
నిద్ర రాకపోతే బెడ్ నుంచి లేచి, ప్రశాంతంగా చేసే పనులు చేయండి.
పుస్తకం చదవడం, రాయడం లేదా బట్టలు మడత పెట్టడం వంటివి. నిద్ర వచ్చినప్పుడు వెళ్లి పడుకోండి.
ఫోన్ లేదా వీడియో గేమ్స్ మాత్రం ఆడకండి. అవి నిద్ర రాకుండా చేస్తాయి.
9. పిల్లలకి బాగా నిద్రపట్టాలంటే...
పిల్లలు సాధారణంగా బాగా నిద్రపోతారు. కానీ ఇంటి వాతావరణం, అలవాట్లు మారితే వారికి సరిగా నిద్రపట్టదు.
వాతావరణం వేడిగా ఉన్నా, పిల్లల పడుకునే సమయం, స్నానం చేయించే సమయాన్ని రోజూలాగే కొనసాగించాలి.
పిల్లలకు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయించాలి. చన్నీళ్లతో వద్దు. ఎందుకంటే అది రక్త ప్రసరణను పెంచి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
పసిపిల్లలు తమకు వేడిగా ఉందా చల్లగా ఉందా చెప్పలేరు. కాబట్టి వారి శరీర ఉష్ణోగ్రతను గమనించడం చాలా ముఖ్యం.
సాధారణంగా పిల్లలు బాగా నిద్రపోవడానికి గది ఉష్ణోగ్రత 16°C నుంచి 20°C మధ్య ఉండాలి. దీన్ని రూమ్ థర్మామీటర్‌తో చెక్ చేసుకోవచ్చు.
10. ఎక్కువగా ఆలోచించకండి
చాలామందికి సరిగ్గా పనిచేయడానికి రోజుకు 7–8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.
కానీ ఒకటి రెండు రాత్రులు నిద్ర సరిగా రాకపోయినా ఎక్కువ మందికి పెద్ద సమస్య ఉండదు. కొంచెం ఎక్కువగా ఆవలించడం తప్ప, సాధారణంగానే పని చేయగలుగుతారు.
వేడి వాతావరణం శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే...
- డీహైడ్రేషన్: చెమట, మూత్రం, శ్వాస ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేయాలి. అందుకే సరిపడా నీళ్లు తాగాలి.
- ఓవర్ హీటింగ్: ఇది గుండె లేదా శ్వాస సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం. లక్షణాలు: తల నొప్పి, వాంతి భావం, చర్మంపై తిమ్మిర్లు.
- అలసట: శరీరంలో నీటిశాతం లేదా సోడియం తగ్గిపోవడం వల్ల అలసటగా ఉంటుది. కళ్లు తిరిగినట్టు అనిపించడం, బలహీనంగా ఉండడంతోపాటు కండరాల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది.
- హీట్‌స్ట్రోక్: శరీర ఉష్ణోగ్రత 40°C లేదా అంతకంటే ఎక్కువైతే హీట్‌స్ట్రోక్ వస్తుంది. లక్షణాలు: స్పృహ కోల్పోవడం, చెమట పట్టకపోవడం, చర్మం పొడిగా మారడం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























