‘లాక్కోకపోతే అధికారం రాదు’... అన్న జ్యోతిష్కుడి మాటల తరువాత డీకే ఏం చేశారు?

కాంగ్రెస్, కర్ణాటక

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కర్ణాటకలోని అత్యంత కోటీశ్వరులైన నాయకుల జాబితాలో డీకే శివకుమార్ ఒకరు.
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్న డీకే శివకుమార్, తన లక్ష్యాలను సాధించుకోవడానికి చూపించే పట్టుదల ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ విషయం ఆయన రాజకీయ గురువు, దివంగత ముఖ్యమంత్రి ఎస్.ఎమ్.కృష్ణకు కూడా ఒక రాత్రి స్పష్టంగా అర్థమైంది.

1999లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ జాబితాలో తన పేరును కూడా చేర్చాలంటూ శివకుమార్ అర్ధరాత్రి ఎస్.ఎమ్.కృష్ణను నిద్రలేపారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా శివకుమారే 2024 డిసెంబర్‌లో కర్ణాటక శాసనసభలో ఎస్.ఎమ్. కృష్ణకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గుర్తుచేసుకున్నారు.

"మంత్రుల జాబితాను ఆయన (ఎస్‌ఎం కృష్ణ), నేను కలిసే తయారు చేసి పార్టీ హైకమాండ్‌కు పంపాం. కానీ రాత్రి తుది జాబితా వచ్చేసరికి, అందులో నా పేరు లేదు."

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''నేను అదే రాత్రి నా జ్యోతిష్యుడు (రాజగురువు బెల్లూరు శంకరనారాయణ ద్వారకానాథ్ ) ను సంప్రదించాను. స్వయంగా వెళ్లి తలుపు తట్టి, మంత్రి పదవిని డిమాండ్ చేయనంత వరకు అది నాకు దక్కదని ఆయన నాతో చెప్పారు. అలాగే అధికారాన్ని సాధించాలంటే దాన్నిలాక్కోవాల్సిందేనన్నారు. నేను ఆయన సలహాను పాటించాను" అని గుర్తు చేసుకున్నారు.

''మరుసటి రోజు ఉదయం జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన మంత్రుల జాబితా అప్పటికే గవర్నర్‌కు చేరిపోయింది. నేను లేకుండా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేరని కృష్ణతో చెప్పాను."

తన రాజకీయ ఎదుగుదలలో తన జ్యోతిష్యుడి పాత్ర ఎంతో ఉందని, ఎన్నికలలో తన గెలుపోటములను కూడా ఆయనే ముందే ఊహించారని శివకుమార్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు చిరునవ్వు నవ్వుతూ, ''ఈసారి ఆయన ఎవరి తలుపు తట్టారో మాకు తెలియదు కానీ, తన లక్ష్యాలను ఎలా సాధించుకోవాలో ఆయన (శివకుమార్)కు బాగా తెలుసని మాత్రం ఒప్పుకోవాల్సిందే'' అని బీబీసీతో వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, కర్ణాటక

ఫొటో సోర్స్, Arijit Sen/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది.

'ముందు పెట్టుబడి.. ఆ తర్వాతే లాభం'

మంత్రివర్గంలో తనను చేర్చుకోకుండా కృష్ణ ముఖ్యమంత్రి కాలేరని చెప్పడానికి ముందే, శివకుమార్ రాజకీయంగా భారీగానే 'పెట్టుబడి' పెట్టారు.

ఎస్.ఎమ్.కృష్ణను రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించడానికి డీకే సహాయం చేశారు. కృష్ణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శివకుమార్ ఆయనకు అత్యంత నమ్మకమైన అనుచరులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

రాజకీయాల్లోనే కాకుండా భూముల్లోనూ పెట్టుబడి పెట్టాలని , శివకుమార్ తన స్నేహితులకు సూచిస్తుండేవారు. భూమి 'ఆర్థిక స్థిరత్వాన్ని' ఇస్తుందని ఆయన వాదన. డాక్టర్ మన్‌మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల కారణంగా బెంగళూరు, దాని పరిసర ప్రాంతాలలో భూముల ధరలు విపరీతంగా పెరగడానికి ముందే ఆయన ఈ మాట చెప్పారు.

సతనూర్ నుంచి కనకపురగా మారిన నియోజకవర్గంలో హెచ్.డి.దేవెగౌడ లాంటి దిగ్గజ నాయకుడిపై ఎన్నికల్లో పోటీ చేయడం కోసం శివకుమార్ తన సొంత భూమిని కూడా అమ్ముకున్నారు.

ఇతరులకు తానిచ్చిన సలహాను ఆయనే స్వయంగా పాటిస్తూ.. రియల్ ఎస్టేట్, గ్రానైట్, విద్యా రంగాల వ్యాపారాలలో తన భాగస్వామ్యాన్ని పెంచుకున్నారు. అలా రాష్ట్రంలోని అత్యంత సంపన్న నాయకుల జాబితాలో ఒకరిగా నిలిచారు.

కాంగ్రెస్, కర్ణాటక

ఫొటో సోర్స్, Arijit Sen/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, 2017 ఆగస్టులో డీకే శివకుమార్ నివాసం, ఇతర ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి

కాంగ్రెస్ 'ట్రబుల్ షూటర్'!

కర్ణాటక వెలుపల కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి గట్టెక్కించారు. అందుకే కొందరు ఆయనను పార్టీ 'ట్రబుల్ షూటర్' అని కూడా పిలుస్తుంటారు.

ఆయనకున్న అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాల కారణంగానే.. 2003లో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని 'డెమోక్రటిక్ ఫ్రంట్' ప్రభుత్వాన్ని కాపాడటం కోసం మహారాష్ట్రకు చెందిన 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన ఆతిథ్యమిచ్చారు.

ఆ అనుభవమే.. 2017లో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్‌కు చెందిన 44 మంది ఎమ్మెల్యేలను శివకుమార్ పర్యవేక్షణలోకి పంపేలా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ప్రేరేపించింది.

తీవ్రమైన పోటీ నెలకొన్న ఆ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం సాధించారు, అలాగే ఆయనను ఓడించాలనే అమిత్ షా ప్రయత్నాలను తిప్పికొట్టారు.

కానీ ఆ తర్వాత, శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిగాయి. 2019లో ఆయన 50 రోజుల పాటు దిల్లీలోని తీహార్ జైలులో ఉండాల్సి వచ్చింది.

ఆ సమయంలోనే సోనియా గాంధీ ఆయనను కలవడానికి తీహార్ జైలుకు వచ్చారు. అప్పుడు శివకుమార్ తనకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవిని ఇవ్వాల్సిందిగా ఆమెను కోరారు.

కర్ణాటకలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని ఆయన ఆ సందర్భంగా ఆమెకు మాట ఇచ్చారు. అన్నట్టుగానే, 2023లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి ఆయన ఆ లక్ష్యాన్ని సాధించారు.

కాంగ్రెస్, కర్ణాటక

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, 2019లో 'భారత్ బచావో' ర్యాలీ సందర్భంగా సోనియా గాంధీ, పీసీ చాకో, డీకే శివకుమార్

సోనియా గాంధీ పాత్ర!

శివకుమార్ 2019లో బెంగళూరులో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ, ''సోనియా గాంధీ తీహార్ జైలుకు వచ్చి, కేపీసీసీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా నన్ను కోరారు. కొందరు హంగ్ వస్తుందని జోస్యం చెప్పినప్పటికీ, సిద్ధరామయ్య, నేను కలిసి పార్టీని బలోపేతం చేసి, మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చాం" అన్నారు.

అదే కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, "మీరు శివకుమార్ గురించి ఏమైనా చెప్పండి, కానీ ఆయన ఒక అద్భుతమైన ఆర్గనైజర్ అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు" అని కొనియాడారు.

పార్టీ సంస్థాగత బలోపేతం కోసం శివకుమార్ పెట్టిన ఆ 'పెట్టుబడే' మే 26న ఆయనకు కలిసివచ్చింది. రాహుల్ గాంధీ మొదట సిద్ధరామయ్యతో సుదీర్ఘంగా సమావేశమై, ఆయనను పదవి నుంచి తప్పుకునేలా ఒప్పించారు.

రాహుల్ గాంధీ ఆ తర్వాత శివకుమార్‌తో స్వల్ప సమయమే సమావేశమై, ఆపై తన తల్లి (సోనియా గాంధీ)తో సంప్రదింపులు జరపడానికి వెళ్లారు.

తర్వాత వెనువెంటనే ఆయన ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిద్ధరామయ్య, శివకుమార్, ఇతర నాయకులతో మరో దఫా సమావేశం జరిగింది. చివరకు, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని ఆ సమావేశంలోనే ఖరారైంది.

కాంగ్రెస్, కర్ణాటక

ఫొటో సోర్స్, ANI

విశ్లేషకులు ఏమంటున్నారంటే..!

అనేక స్థాయిలలో పార్టీ పట్ల శివకుమార్ చూపిన విధేయతకు దక్కిన బహుమతి ఈ పదవి అని రాజకీయ విశ్లేషకులు, 'నిట్టే' (ఎన్ఐటీటీఈ) ఎడ్యుకేషన్ ట్రస్ట్ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి అభివర్ణించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కర్ణాటకలో నాయకత్వ మార్పును ఇక ఎంతమాత్రం వాయిదా వేయలేని పరిస్థితి వచ్చింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో పార్టీ హైకమాండ్ ఇప్పటికే చూసింది. కర్ణాటకలో అలాంటి రిస్క్ కొనితెచ్చుకోవడానికి హైకమాండ్ సిద్ధంగా లేదని భావిస్తున్నాను" అని అన్నారు.

మరోవైపు పార్టీపరంగా చూస్తే, సిద్ధరామయ్య తన పాలనలో పార్టీలోని రెండు సమాంతర అధికార కేంద్రాల మధ్య చిక్కుకుపోయారని చర్చ నడుస్తోంది. తన రెండో పదవీకాలంలో సిద్ధరామయ్య ఒకవైపు శివకుమార్, మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల ప్రభావంతో సతమతమయ్యారు.

అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ ఎ.నారాయణ బీబీసీతో మాట్లాడుతూ, "అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే, కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి రావడం. అయితే, శివకుమార్ ముందున్న అతిపెద్ద సవాలు ఏంటంటే... అందరినీ, ముఖ్యంగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను ఎలా కలుపుకొని వెళ్తారనేదే" అని పేర్కొన్నారు.

సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహించే 'కురుబ' సామాజిక వర్గం, ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా కాంగ్రెస్‌కు ఇదే విధంగా మద్దతు ఇస్తూనే ఉంటుందా లేదా? అనే విషయంపై కూడా పార్టీ లోపల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రొఫెసర్ నారాయణ దీనిపై స్పందిస్తూ, "క్షేత్రస్థాయిలో కురుబ సామాజిక వర్గం ఆధిపత్యాన్ని వ్యతిరేకించే ఇతర ఓబీసీ వర్గాలన్నింటినీ శివకుమార్ ఏకం చేసే అవకాశం ఉంది. కానీ, ఇది చాలా కష్టమైన పని" అని విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)