ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీలోకి రిలయన్స్... రోల్స్ రాయిస్‌తో జాయింట్ వెంచర్‌ పై కీలక ప్రకటన

రిలయన్స్, రోల్స్ రాయిస్, ఫైటర్ జెట్ ప్రొగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

భారత ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ కోసం ఇంజిన్లను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి బ్రిటన్‌ కంపెనీ రోల్స్ రాయిస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం తెలిపింది.

భారత్ తన అత్యంత అధునాతన యుద్ధ విమానం స్టెల్త్ ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఈ భాగస్వామ్యం ఉంది.

అధునాతన మధ్యతరహా యుద్ధ విమానానికి చెందిన ప్రోటోటైప్ (నమూనా) 2028లో సిద్ధం అవుతుందని భావిస్తున్నారు. భవిష్యత్‌లో భారత వాయు యుద్ధ సామర్థ్యాలలో ఈ విమానం కీలక పాత్ర పోషించనుంది.

న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రకారం.. ముందటేడాది భారత్ తన అత్యంత అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించి, దానిపై ఆసక్తిని తెలియజేయాలని రక్షణ రంగంలోని కంపెనీలను కోరింది.

పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ జరిగిన కొన్ని వారాల తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికాపై ఆధారపడే వ్యూహాన్ని తగ్గించడం

యుద్ధ విమానాల ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేసేందుకు కనీసం మూడు దేశాలకు చెందిన తయారీదారులతో భారత్ చర్చలు జరుపుతోందని గతేడాది మే 25న అమెరికా మీడియా అవుట్‌లెట్ బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది.

''ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తన సామర్థ్య లోటుపాట్లను పరిష్కరించుకునేందుకు అమెరికాకు వెలుపల తన రక్షణ భాగస్వామ్యాలను భారత్ విస్తరిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్‌లకు చెందిన ఇంజిన్‌లను పరిశీలిస్తోంది. భారత్ ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించాలనుకుంటోంది. ఈ ప్రతిపాదనలను డీఆర్‌డీఓ పరిశీలిస్తోంది'' అని బ్లూమ్‌బర్గ్ రాసింది.

''అమెరికాతో కలిసి జెట్ ఇంజిన్లను తయారు చేయడం అనేది ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే విస్తృత ప్రయత్నంలో ఒక భాగం. అయితే, కీలక టెక్నాలజీల కోసం అమెరికా నుంచి భారత్ ఇతర దేశాల వైపు మళ్లడాన్ని, అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతంగా భావించకూడదు. బదులుగా, ఇది నమ్మదగిన సప్లై చైన్‌ను నిర్ధరించుకోవడంపై భారత్ పెడుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది'' అని రాసింది.

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ డేటా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారి భారత్. ఇటీవల కాలంలో, అమెరికా, ఫ్రాన్స్‌లకు చెందిన రక్షణ తయారీదారుల నుంచి ఆయుధాలను కొనేందుకు భారత్ ఎక్కువగా దృష్టి పెట్టింది.

దిగుమతి చేసుకునే రక్షణ పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ట్విన్-ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు దేశీయ కంపెనీలకు మార్గం కూడా సుగమం చేసింది.

అధునాతన మధ్యతరహా యుద్ధ విమానం (ఏఎంసీఏ-అడ్వాన్స్‌డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రోగ్రామ్ కోసం భారత్ ఈ మోడల్‌ను ఆమోదించింది.

''ఈ భాగస్వామ్యం భారత్‌లో ఏఎంసీఏ ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు బలమైన పునాది వేస్తుంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులను అమలు చేసేందుకు ప్రపంచస్థాయి సాంకేతికతను, సామర్థ్యాలను ఒక చోటుకు చేర్చుతుంది'' అని ఈ కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

రిలయన్స్, రోల్స్ రాయిస్, ఫైటర్ జెట్ ప్రొగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

రిలయన్స్ ప్రకటనలో ఏం చెప్పింది?

భారత్‌లో ఒక ప్రత్యేక ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ను నిర్మించే అవకాశాన్ని రిలయన్స్, రోల్స్ రాయిస్ సంస్థలు కలిసి అన్వేషిస్తాయని శుక్రవారం వెల్లడించిన తమ ప్రతిపాదిత భాగస్వామ్యంలో పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా ఇంజిన్లను అభివృద్ధి చేస్తాయి.

''భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి కీలక సాంకేతికతల్లో స్వతంత్ర సామర్థ్యాలు అవసరం. భారత్‌లో పూర్తి స్వదేశీ ఏరో ఇంజిన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రోల్స్ రాయిస్‌తో కలిసి అడ్వాన్స్‌డ్ ప్రొపల్షన్‌లో వారి ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని రిలయన్స్ టెక్నాలజీ, తయారీ, ప్రాజెక్టు అమలు సామర్థ్యాలతో మేళవించాలని మేం భావిస్తున్నాం'' అని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఒక ప్రకటనలో చెప్పారు.

''భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చడంతో పాటు, కాలక్రమేణా అత్యాధునిక ప్రొపల్షన్ టెక్నాలజీలలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేసే ఒక సుస్థిరమైన జాతీయ సామర్థ్యాన్ని కలిసి నిర్మించాలనుకుంటున్నాం. స్వయం సమృద్ధి, అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు ఇది మా వంతు సహకారం'' అని పేర్కొన్నారు.

''రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి పనిచేసే ఈ అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దీని ద్వారా అధునాతన ఇంజనీరింగ్, ఇంజిన్ నైపుణ్యంలో మా శతాబ్దాల వారసత్వం, భారత పరిశ్రమలో వారి దేశీయ నాయకత్వానికి తోడవుతుంది" అని రోల్స్ రాయిస్ సీఈఓ టోఫాన్ ఎర్గిన్‌ బిల్గిక్ అన్నారు.

''భారత్‌లో మా ప్రస్తుత భాగస్వామ్యాలు, సామర్థ్యాలు కలిసి దేశంలో స్వయం సమృద్ధి గల, బలమైన ఏరోస్పేస్ వ్యవస్థను అభివృద్ధి చేసే కృషిలో ఒక కీలక మైలురాయి'' అని తెలిపారు.

భారత్ ప్రభుత్వానికి చెందిన కంపెనీ జీటీఆర్‌ఈతో వేరుగా జాయింట్ వెంచర్ ప్రతిపాదన చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ సాఫ్రాన్‌కు పోటీగా రోల్స్ రాయిస్‌ ప్రకటన నిలిచే అవకాశం ఉంది.ఏఎంసీఏ ఫైటర్ జెట్ తర్వాతి వెర్షన్‌ల కోసం అధిక థ్రస్ట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 4.5 జనరేషన్ తేజస్ ఫైటర్ జెట్‌ను తయారు చేస్తోంది. అయితే, అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్‌తో సప్లయి చెయిన్ సమస్యల కారణంగా, ఆ సంస్థ నుంచి ఇంజిన్ల డెలివరీలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.

రోల్స్ రాయిస్ గతంలో మిలటరీ ప్రొపల్షన్ ప్రోగ్రామ్‌ల కోసం భారత్‌తో కలిసి పని చేసింది. ఈ సంస్థ వివిధ రకాల రక్షణ, సివిల్ ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం ఇంజిన్లను అందిస్తోంది.

రిలయన్స్, రోల్స్ రాయిస్, ఫైటర్ జెట్ ప్రొగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేట్ కంపెనీల ఎంపిక

ఈ ఏడాది మే నెలలో, మే 27న, స్వదేశీ యుద్ధ విమానాల ఉత్పత్తికి సంబంధించి భారత్ ఒక కీలక ప్రకటన చేసింది.

అధునాతన మధ్యతరహా యుద్ధ విమానానికి (ఏఎంసీఏ) చెందిన ఐదు నమూనాలను సిద్ధం చేయనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

దీనికోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్‌అండ్‌టీ-బీఇఎల్(బెల్)-డైనమాటిక్ కన్సార్షియం, భారత్ ఫోర్జ్-బీఇఎంఎల్-డేటా ప్యాటర్న్స్ కన్సార్షియం అనే మూడు ప్రైవేట్ కంపెనీలను రక్షణ శాఖ ఎంపిక చేసింది.

ఎఫ్-35, సుఖోయ్-57 విమానాలను అమెరికా, రష్యా దేశాలు భారత్‌కు ఆఫర్ చేసినప్పటికీ, భారత్ వాటిని దేశీయంగా తయారు చేసే దిశగా చర్యలు చేపట్టింది.

ఇక్కడ ఇంకో విశేషం.. ప్రభుత్వ విమాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దీనికి ఎంపిక కాలేదు.

ప్రోగ్రామ్ జాప్యం, విమానాలను సకాలంలో అందించకపోవడం వంటి విషయాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గతంలోనే హెచ్‌ఏఎల్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది..

హెచ్‌ఏఎల్‌కు చాలా ఎక్కువ కాంట్రాక్టులు ఉన్నాయని, దాని సామర్థ్యానికి మించి కాంట్రాక్టులు ఉన్నాయని, గత 20-40 ఏళ్లుగా దాని పనితీరు చాలా పేలవంగా ఉందని, అందుకే ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు అన్నారు.

తొలి నమూనాను సిద్ధం చేయడానికి ఎంపికైన కంపెనీలకు ప్రభుత్వం 30 నెలల గడువు ఇచ్చింది.

రిలయన్స్, రోల్స్ రాయిస్, ఫైటర్ జెట్ ప్రొగ్రామ్

ఫొటో సోర్స్, Zhang Hengwei/China News Service/VCG via Getty Images)

ఇంజిన్ సప్లయి ప్రధాన అడ్డంకి

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి తేజస్ యుద్ధ విమానాలను ఆర్డర్ చేశారు. అయితే, తేజస్ విమానాల డెలివరీలు షెడ్యూల్ కంటే వెనుకబడి ఉన్నాయి.

దీనికి ప్రధాన కారణం జెట్ ఇంజిన్ల సరఫరానే.

గత నెలలో ఫ్రంట్‌లైన్‌లో ప్రచురితమైన రిపోర్టులో.. మొత్తం 180 నాలుగో తరం తేజస్ ఎంకే-1ఏ విమానాలను తయారు చేసేందుకు హెచ్‌ఏఎల్‌కు రెండు ప్రధాన కాంట్రాక్టులు లభించాయి. అయితే, మొదటి కాంట్రాక్టు కింద డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు.

వాస్తవానికి, ఈ విమానాలలో అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్‌కు చెందిన ఎఫ్404 ఇంజిన్‌లను అమర్చారు.

విమానం డెలివరీలో జాప్యానికి జీఈ ఏరోస్పేస్‌నే కారణమని హెచ్‌ఏఎల్‌ నిందించింది.

దేశం మరింత ప్రతిష్ఠాత్మకమైన ఐదో తరం స్టెల్త్ ఫైటర్ ప్రోగ్రామ్, ఏఎంసీఏ, 4.5-జనరేషన్ ఫైటర్ తేజస్ ఎంకే2 ప్రోగ్రామ్ గురించి కూడా ఇప్పుడు ఇలాంటి ఆందోళనలే వ్యక్తమవుతున్నాయి.

ఈ రెండు విమానాల కోసం జీఈ ఏరోస్పేస్ ఎఫ్414-జీఈ-ఐఎన్ఎస్6 టర్బోఫ్యాన్ ఇంజిన్‌ను భారత్ ఎంపిక చేసుకుంది.

ఈ ఇంజిన్‌ను సంయుక్తంగా ఉత్పత్తి చేయాలనేది ప్రారంభ ప్రణాళిక. కానీ, ధర, స్థానిక తయారీ, సాంకేతికత బదిలీకి సంబంధించిన చర్చలు ఇంకా ముగింపుకు రాలేదు.

చర్చల సందర్భంగా జీఈ ఏరోస్పేస్ ధరను గణనీయంగా పెంచిందని ఒక కొత్త నివేదిక వెల్లడిస్తోందని ఫ్రంట్‌లైన్ పేర్కొంది. మొదట్లో ఒక్కో ఇంజిన్‌ సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు ఆ కంపెనీ ధరను మూడు రెట్లు పెంచి, సుమారు రూ.200 కోట్లుగా చెబుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, సొంతంగా యుద్ధ విమాన ఇంజిన్‌ను తయారుచేయడం భారత్‌కు మరింత అవసరంగా మారింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)