తృణమూల్ కాంగ్రెస్: ‘విజయవంతమైన’ మహిళా నేత తన పార్టీని ఎలా చేజార్చుకుంటున్నారు?

పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ, పార్టీ ఫిరాయింపులు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, మమతా బెనర్జీ
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయ పార్టీలు ఓటమిని తట్టుకుని నిలబడతాయి. అయితే అకస్మాత్తుగా అధికారాన్ని కోల్పోయినప్పుడు ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకుని నిలబడటానికి పోరాడాల్సి వస్తుంది.

10 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి ఇది.

అధికారం కోల్పోయిన నెల తర్వాత ఆ పార్టీ శాసన సభ్యుల్లో ఎక్కువ మంది తిరుగుబాటు చేశారు. ఎంపీల్లో చీలిక ఏర్పడింది. పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ నాయకత్వంపై వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మమతా బెనర్జీ ఆషామాషీ ప్రాంతీయ నాయకురాలు కాదు. పశ్చిమ బెంగాల్‌లో అప్రతిహతంగా 34 ఏళ్ల పాటు సాగిన కమ్యూనిస్టుల పాలనకు ఈ ఉద్వేగభరిత రాజకీయవేత్త 2011లో ముగింపు పలికారు.

ప్రపంచంలోనే ఎన్నికల్లో గెలిచి అత్యంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాలలో ఒకదాన్ని ఓడించడం ద్వారా అనేక మంది అసాధ్యం అనుకున్న దాన్ని సాధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో మమతా బెనర్జీ ఒకరని టైమ్ పత్రిక గతంలో పేర్కొంది.

ఆమె 15 ఏళ్లు అధికారంలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో విజయవంతమైన పార్టీగా నిలబెట్టారు. దేశంలో శక్తివంతమైన ప్రతిపక్ష రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.

అందుకే గత నెల రోజులుగా జరుగుతున్న సంఘటనలు అంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకత, మతపరమైన ధృవీకరణ, ఓటర్ల జాబితాల చుట్టూ వివాదం వంటి బలమైన పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి అధికారాన్ని దక్కించుకుంది.

పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ, పార్టీ ఫిరాయింపులు

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, పశ్చిమబెంగాల్‌లో శుభేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌కు 40శాతం ఓట్లు

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మమతా బెనర్జీ పార్టీ తుడిచిపెట్టుకుపోలేదు. ఆ పార్టీకి బీజేపీ కంటే కేవలం 30 లక్షల ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 శాతం ప్రజాదరణ ఆ పార్టీకి దక్కింది. పశ్చిమబెంగాల్ ఓటర్లలో 2.60 కోట్ల మంది తృణమూల్‌కు ఓటేశారు.

అసెంబ్లీలో 80 మంది శాసనసభ్యులు, పార్లమెంటులో 28 మంది ఎంపీలతో టీఎంసీ ఇప్పటికీ గణనీయమైన రాజకీయ శక్తిగా ఉంది.

ఏ విధంగా చూసినా ఓటమి తర్వాత ఆ పార్టీ పుంజుకోవాలి. కానీ అది రోజురోజుకీ శక్తిని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

మమతా బెనర్జీకి అసలైన షాక్ శాసనసభలోనే తగిలింది. ఎన్నికలు జరిగిన కొన్ని వారాలకే తృణమూల్ సభ్యులలో దాదాపు ముప్పావు వంతు మంది మమతా బెనర్జీకి, ఆమె రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్షాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. తమ నాయకుడిని ఎన్నుకున్నారు.

శాసనసభ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారని పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేశారు.

తొలుత రాష్ట్ర స్థాయి వ్యవహారంగా కనిపించిన తిరుగుబాటు ఇప్పుడు దిల్లీకి వ్యాపించింది.

టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీలలో 20 మంది పార్టీ పార్లమెంటరీ గ్రూపు నుంచి విడిపోయి బీజేపీ నాయకత్వంలోని అధికార కూటమిలో చేర్చాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు కథనాలు వచ్చాయి.

ఇది నిజమైతే, ఎమ్మెల్యేల స్థాయిలో మొదలైన తిరుగుబాటు సంక్షోభంగా మారి నాయకత్వానికి, పార్టీ మనుగడకు సవాలుగా మారనుంది.

పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ, పార్టీ ఫిరాయింపులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఆమె ప్రతిష్ట మసకబారింది.

పార్టీ నిర్మాణంలో లోపమా?

ఎంపీల తిరుగుబాటు నాయకత్వ విస్తృత వైఫల్యాన్ని సూచించే స్పష్టమైన అంశం.

2021లో 56శాతం ఓట్లతో టీఎంసీ గెలిచిన ఫాల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ జరిగినప్పుడు అభ్యర్థిని నిలబెట్టడంలో టీఎంసీ విఫలమైంది.

ఆ తర్వాత పార్టీ పతనానికి సంబంధించి స్పష్టమైన సంకేతం ఒకటి వచ్చింది. జూన్‌ ప్రారంభంలో జరిగిన పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు కేవలం కొన్ని వందల మంది మాత్రమే హాజరయ్యారు.

ఒకప్పుడు మమతాబెనర్జీ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచిన భారీ బలప్రదర్శనకు ఇది పూర్తి విరుద్ధం.

అధికారం ఆశ్చర్యకరమైన వేగంతో క్షీణించిపోయింది. దాదాపు ప్రతిరోజూ.. టీఎంసీ నాయకులను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసి బహిరంగంగా ఊరేగిస్తున్నారు.

పార్టీ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయి. సంస్థాగత నెట్‌వర్క్‌ విచ్ఛిన్నమవుతోంది. ఒకప్పుడు భయాన్ని, ప్రభావాన్ని సృష్టించిన ప్రముఖులపై వారి సొంత కంచుకోటల్లో బహిరంగంగానే దాడులు జరుగుతున్నాయి.

"ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు" అని పొలిటికల్ సైంటిస్ట్ ద్వైపాయన్ భట్టాచార్య అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఇంత వేగంగా పతనం కావడం ఆ పార్టీ నిర్మాణంలో బలహీనతను సూచిస్తోంది. 2011లో కమ్యూనిస్టుల్ని ఓడించిన దానికి భిన్నంగా, అధికారం కోల్పోయిన తర్వాత నిలదొక్కుకోగల పటిష్టమైన సైద్ధాంతిక నిర్మాణం గురించి ఆ పార్టీ ఎప్పుడూ ఆలోచించలేదు.

పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ, పార్టీ ఫిరాయింపులు

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

రెండు స్తంభాలు

మమతా బెనర్జీ వ్యక్తిగత ఆకర్షణ, అధికారంతో పాటు వచ్చే అండదండల కలయికే పార్టీని ఏకతాటిపై నడిపాయి.

"ఆ పార్టీ రెండు స్తంభాలపై నిలబడి ఉంది. అవి మమతా బెనర్జీ బ్రాండ్, ప్రభుత్వ వనరులు" అని భట్టాచార్య చెప్పారు.

"బెంగాల్‌ను నియంత్రించడానికి మమతాబెనర్జీ పార్టీ సంస్థాగత నిర్మాణం కంటే, ఆయా ప్రాంతాల్లో శక్తివంతులైన స్థానిక నాయకులపైనే ఎక్కువగా ఆధారపడ్డారు" అని భట్టాచార్య చెప్పారు.

పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఈ ఏర్పాటు మెరుగైన ఫలితాలను ఇచ్చింది.

స్థానికంగా బలవంతులైన నాయకులు ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీపడ్డారు. ఇది పార్టీలో అంతర్గత కలహాలు, హింసకు దారి తీసింది.

అధికారం ఇచ్చిన రక్షణ, రాజకీయ ఆశ్రయం లాంటివి ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యేందుకు అవకాశం కల్పించాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అనే వ్యవస్థకు రెండు స్తంభాలుగా ఉన్న అధికారం, మమతా బెనర్జీ ప్రతిష్ట బలహీనమయ్యాయి.

"టీఎంసీ అధికారం కోల్పోయింది. మమతా బెనర్జీ వ్యక్తిగత ఓటమి ఆమె రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీసింది.

దీంతో స్థానికంగా శక్తివంతులైన పార్టీ నాయకులు, దర్యాప్తు సంస్థల దాడులు, ప్రజాగ్రహం, ప్రత్యర్థుల వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

"వీటి నుంచి తప్పించుకునేందుకు పార్టీ ఫిరాయించడం లేదా తమ విధేయతను మార్చుకుంటున్నారు" అని భట్టాచార్య అన్నారు.

ఇక్కడే బీజేపీ కథలోకి ప్రవేశిస్తోంది.

పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ, పార్టీ ఫిరాయింపులు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరిచారని పశ్చిమబెంగాల్ బీజేపీ నేతలు చెబుతున్నారు.

ప్రాంతీయ పార్టీల్లో తిరుగుబాట్లు

జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుగుదల ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేస్తోందని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఫెలో రాహుల్ వర్మ అంటున్నారు.

గతంలో పార్టీ ఫిరాయింపులనేవి సాధారణంగా ఒకరిద్దరు నాయకులు పార్టీ మారడంతో ముగిసేవి. అయితే ప్రస్తుతం బీజేపీ నుంచి ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలు, అధికారం, వనరులు, రాజకీయ రక్షణ లాంటివి లభిస్తూ ఉండటంతో ప్రాంతీయ పార్టీల్లో తిరుగుబాటు గ్రూపుల రూపంలో జరుగుతోంది.

శివసేనలో వచ్చిన చీలిక ఈ ధోరణికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

"పార్టీలో వారసత్వ పోరాటం, కుటుంబాల్లో అధికారం కేంద్రీకృతం కావడం లాంటివి పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారి తీశాయి" అని వర్మ చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలు భారత రాజకీయాల్లో వస్తున్న విస్తృత పరివర్తనలో భాగమేనని వర్మ భావిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలు రోజు రోజుకీ కుటుంబం కేంద్రంగా మరింత కేంద్రీకృతంగా మారుతున్నాయని ఆయన వాదిస్తున్నారు.

"ఆశావహులైన అనుచరులు పార్టీ అధినాయకుడిని అంగీకరించవచ్చు. కానీ నాయకత్వం వారసుడికి అప్పగించినప్పుడు ఆ విధేయత ఉండదు. ఉద్దవ్ థాకరే తన కుమారుడు ఆదిత్య థాకరేను ముందుకు తీసుకురావడంతో శివసేనలో చీలిక వచ్చింది" అని వర్మ విశ్లేషించారు.

గతంలో రాజకీయాల్లో వారసత్వ పోరాటం సాధారణంగా కుటుంబాలకే పరిమితం అయ్యేది లేదా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనడానికి అసమ్మతి వాదులను కూడగట్టడంతో ముగిసేది.

బీజేపీ రాక ఆ సమీకరణాన్ని మార్చేసింది.

ప్రస్తుతానికి, 71 ఏళ్ల మమతా బెనర్జీ తన పట్టును వదలడం లేదు.

ఆమె బీజేపీ విజయాన్ని "చట్టవిరుద్ధం, అనైతికం" అని చెబుతూ, సుమారు 100 సీట్లను "దోచుకున్నారని" ఆరోపించారు.

పార్టీలో తిరుగుబాటును పచ్చి అవకాశవాదంగా కొట్టిపారేశారు.

"ఇంతకాలం కొందరు అధికారాన్ని అనుభవించారు, ఇప్పుడు మనం ఓడిపోగానే, వారు మరో పార్టీతో అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తున్నారు" అని ఆమె గత వారం అన్నారు.

అయినప్పటికీ పార్టీ కోలుకుంటుందని ఆమె గట్టిగా చెబుతున్నారు.

"మేము పార్టీని కొత్తగా పునర్నిర్మిస్తాం. టీఎంసీ దాని నాయకుల కోసం కాదు. అది దాని కార్యకర్తల కోసం" అని అన్నారు.

పశ్చిమ బెంగాల్, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ, పార్టీ ఫిరాయింపులు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, మమతా బెనర్జీ

టీఎంసీ పుంజుకోగలదా?

ఈ తిరుగుబాటు నీరుగారిపోవచ్చు లేదా టీఎంసీలోకి ఫిరాయించిన మాజీ కమ్యూనిస్ట్ అయిన చిన్న శాసనసభ్యుడి నాయకత్వంలోని తిరుగుబాటుదారులు మరింతగా చీలిపోయి బెనర్జీ వద్దకు తిరిగి వెళ్ళవచ్చు.

ఇప్పుడు చీలికకు మద్దతు తెలుపుతున్న ఎంపీలు బలంగా నిలబడితే, టీఎంసీకి రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు ఊహించిన దాని కంటే తీవ్రంగా ఉండవచ్చు.

అయినప్పటికీ మమతా బెనర్జీని తక్కువ అంచనా వేయడం తొందరపాటు అవుతుంది.

"ఆమె తిరిగి రాగలరు" అని భట్టాచార్య అన్నారు.

"బెంగాల్‌లో ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించే ముఖం, ప్రజలు అంత తేలికగా కొట్టిపారేయలేని స్వరం ఏదైనా ఉందంటే అది ఆమెదే" అని ఆయన చెప్పారు.

అయితే, ఏ పునరుజ్జీవనానికైనా ఆకర్షణ కంటే ఎక్కువ అవసరమని ఆయన వాదిస్తున్నారు.

పార్టీని పునరుద్ధరించడానికి, దాని నాయకత్వం గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సంసిద్ధత అవసరం.

ఇప్పటివరకు మమతా బెనర్జీకి అలాంటి బలమైన లక్షణం లేదు.

రాజకీయాల్లో తన కెరీర్ పొడవునా, బెనర్జీ రాజకీయ ప్రతికూలతలను అధిగమించారు. అయినప్పటికీ, ఆమె ముందున్న సవాలు గతంలో ఎన్నడూ ఆమె ఎన్నడూ ఎదుర్కోనిది.

ప్రభుత్వాన్ని కూలదోయడం ఒక విషయం. సొంత నాయకులే పార్టీని వీడి వెళ్ళిపోయిన తర్వాత, ఆ పార్టీని పునర్నిర్మించడం పూర్తిగా మరో విషయం కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)