సౌదీ అరేబియా ఇతర దేశాల కంటే 10 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ భారీగా డ్రోన్లు ఎందుకు కొంటోంది? అమెరికాపై అపనమ్మకం పెరిగిందా?

ఫొటో సోర్స్, Getty Images
గత నెలలో తైవాన్ నుంచి డ్రోన్లు భారీ సంఖ్యలో కొనుగోలు చేసిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది.
సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో డ్రోన్లను కొనుగోలు చేసిందని, ఇతర దేశాల కంటే ఒక్కో డ్రోన్‌కు దాదాపు 10 రెట్లు ఎక్కువ చెల్లించినట్లు అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
సౌదీ అరేబియా 4.72 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లు కొనుగోలు చేసినట్లు తైపీ ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన డేటాలో ఉంది.
జూన్ 2023 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఒక దేశం ఒక నెలలో చేసిన అతిపెద్ద డ్రోన్ కొనుగోలు ఇదే.
"సౌదీ అరేబియా ఈ డ్రోన్లను ఎందుకోసం ఉపయోగించనుందో స్పష్టంగా తెలియదు. వాటి సగటు బరువు 7 నుంచి 15 కేజీల మధ్య ఉంటుంది. వాటిని సైనిక ప్రయోజనాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు" అని బ్లూమ్‌బెర్గ్ తన నివేదికలో పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా 3,260 డ్రోన్ల కోసం ఒక్కో డ్రోన్‌కు సగటున 14,472 డాలర్లు చెల్లించగా, అదే కేటగిరీలో ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసిన డ్రోన్ల సగటు ధర ఒక్కో డ్రోన్‌కు 1,464 డాలర్లుగా ఉంది.
ఇరాన్, సౌదీ అరేబియా మధ్య అవిశ్వాసం దశాబ్దాల నాటిది. కానీ, సౌదీ అరేబియా ఇరాన్ దాడుల నుంచి గతంలో చాలా వరకు సురక్షితంగానే ఉంది.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
యుద్ధ సమయంలో ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడుల్లో అత్యధిక భాగం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలపై జరిపి ప్రతీకారం తీర్చుకుంది. వీటిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఎక్కువ దాడులు జరిగాయి. సౌదీ అరేబియాను కూడా లక్ష్యంగా చేసుకుంది.
ఈ యుద్ధ ప్రభావం, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం, ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ ఆర్థిక వ్యవస్థలను చమురుపై ఆధారపడకుండా చేయడానికి సంవత్సరాల తరబడి చేసిన కృషి, బిలియన్ల డాలర్ల పెట్టుబడుల ద్వారా నిర్మించుకున్న భద్రతకు సవాల్ విసిరాయి.
గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అవి తమ భద్రత కోసం అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం వాటికి ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదు.
మరోవైపు, ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ చర్యలు గల్ఫ్ దేశాలకు కొత్త భద్రతా సవాళ్లను సృష్టించాయి.
అమెరికాపై పెరుగుతున్న అపనమ్మకం
యుద్ధ సమయంలో సౌదీ అరేబియా, యూఏఈలపై జరిగిన దాడులను నివారించడంలో అమెరికా విఫలమైంది. హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడంలో సాయపడినందుకు గల్ఫ్ దేశాలు ప్రతిఫలం చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం(జులై 14) ఓవల్ ఆఫీసులో విలేఖరులతో అన్నారు.
అమెరికా మిత్రదేశాల మధ్య అవిశ్వాసం పెరుగుతోందని ఈ నెల 10న అమెరికా మాజీ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ 'ఎక్స్'లో రాశారు.
"మిత్రదేశాలతో సంబంధాలెప్పుడూ దాతృత్వం లేదా ఉపకారాల మీద ఆధారపడి ఏర్పడలేదు. అవి మన సొంత భద్రత, శ్రేయస్సును పెంపొందించే దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాల మీద నిర్మితమయ్యాయి.
మిత్రదేశాలు అమెరికాపై నమ్మకాన్ని కోల్పోవడం ప్రారంభించినప్పుడు అవి వాషింగ్టన్ తన విధానాన్ని మార్చుకునే వరకు ఊరికే వేచి ఉండవు. కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతాయి. అవి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటాయి. అవి ప్రత్యామ్నాయ నాయకత్వ ఎంపికల కోసం అన్వేషిస్తాయి. ఒకసారి అటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని తిరిగి మార్చడం అంత సులభం కాదు" అని బ్లింకెన్ రాశారు.
"మన ప్రత్యర్థులు, పోటీదారులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. రష్యా చాలా కాలంగా ట్రాన్స్-అట్లాంటిక్ కూటమిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్య దేశాలు ఏకతాటిపై నడవలేకపోయినప్పుడల్లా చైనాకు ప్రయోజనం చేకూరుతుంది. అమెరికా విశ్వసనీయతపై వచ్చే ప్రతి ప్రశ్న బలహీనమైన, మరింతగా విడిపోయిన పాశ్చాత్య దేశాలను కోరుకునే శక్తులకు ఒక అవకాశంగా మారుతుంది" అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
సౌదీ అరేబియా దృష్టిలో ఇరాన్ యుద్ధం
ఇరాన్‌తో యుద్ధంపై సౌదీ అరేబియా వైఖరి తీవ్రమైన సందిగ్ధతతో ఉందని సౌదీ అరేబియాలో అమెరికా మాజీ రాయబారి అయిన మైకేల్ రాట్నీ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ స్టడీస్ నివేదికలో తెలిపారు. సౌదీ ఓ వైపు ఇరాన్‌పై కోపంగానూ, మరోవైపు అత్యంత అప్రమత్తంగానూ ఉంది.
సౌదీ ఆలోచనా విధానం ఎలా ఉందనేదానికి అత్యంత స్పష్టమైన సంకేతం మార్చి 9న విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడైంది. ఆ ప్రకటనను ఆగ్రహపూరితమైనదిగా, అదే సమయంలో సమతుల్యమైనదిగా ఆయన వర్ణించారు.
ఆ ప్రకటన సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలపై ఇరాన్ దాడులను ఖండించింది. తన సొంత భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు సౌదీ అరేబియాకు ఉందని నొక్కి చెప్పింది.
ఇరాన్ దాడులు కొనసాగితే ఇరు దేశాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అయితే, ఆ ప్రకటన ఇరాన్‌పై ప్రత్యక్ష సైనిక చర్య గురించి స్పష్టంగా హెచ్చరించలేదు.
"గల్ఫ్ దేశాలను సంప్రదించకుండా యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా, ఒకవేళ నేరుగా ఈ సంఘర్షణలోకి తాము ప్రవేశిస్తే తమను పూర్తిగా రక్షిస్తుందని సౌదీ అరేబియా నమ్మడం లేదు. అంతేకాకుండా ఏదో ఒక సమయంలో అమెరికా 'మిషన్ పూర్తయింది' అని ప్రకటించి, వైదొలుగుతుందని, దాని పర్యవసానాలను సౌదీ అరేబియా ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అది భయపడుతోంది" అని మైకేల్ రాట్నీ తెలిపారు.
క్షిపణి, అణు సామర్థ్యాలు దెబ్బతిని ఉన్న ఇరాన్ పరిస్థితిని సౌదీ అరేబియా అవకాశంగా భావిస్తుంది. కానీ, యుద్ధం ఇరాన్ సవాలును శాశ్వతంగా పరిష్కరిస్తుందని నమ్మకం లేదు. ఒకవేళ ఇరాన్లో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడితే శరణార్థుల సంక్షోభం, తీవ్రవాదం వంటి కొత్త సమస్యలు తలెత్తవచ్చని కూడా అది భయపడుతోంది.
ఈ యుద్ధం సౌదీ అరేబియాను అమెరికాకు దూరం చేస్తుందనే వాదనను సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ స్టడీస్ నివేదిక తోసిపుచ్చింది. సౌదీ సైనిక నిర్మాణం, ఆయుధాలు, శిక్షణ, సైనిక సహకారం దశాబ్దాలుగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. ఈ ఏర్పాటును చైనా లేదా పాకిస్తాన్ అంత సులభంగా భర్తీ చేయలేవు.
"సౌదీ అరేబియా గందరగోళ పరిస్థితుల కంటే స్థిరత్వానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇరాన్ బలహీనపడడం ప్రయోజనకరంగా భావించినప్పటికీ ఆర్థిక, సైనిక నష్టాల కారణంగా, అలాగే అమెరికా భద్రతా హామీలపై ఉన్న అనిశ్చితి వల్ల యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సౌదీ వెనుకాడుతోంది. బలహీనపడిన, విశ్వసనీయత లేని ఇరాన్‌తో తన సంబంధాలను సౌదీ అరేబియా జాగ్రత్తగా కొనసాగించాల్సిఉంటుంది" అని మైకేల్ రాట్నీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
డైలమాలో సౌదీ
ఇరాన్ దాడులను నిరోధించగల సామర్థ్యం తమ దేశానికి ఉందనే సౌదీ అరేబియా అధికారిక ప్రకటనలు ప్రజలకు నిరంతరం భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుంచి దూసుకొస్తున్న డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసినట్టు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ దాదాపు ప్రతిరోజూ ప్రకటించింది.
అయితే, 2026 మార్చి 3 నుంచి ఏప్రిల్ 5 మధ్య ఇది సుమారు 900 వైమానిక ముప్పులను అడ్డుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయినప్పటికీ ఇరాన్, ఇరాక్ మద్దతుగల బృందాలు జరిపిన దాడుల్లో రాస్ తనూరాలోని అరామ్కో రిఫైనరీ దెబ్బతింది. యాన్ బూలోని రిఫైనరీపై దాడి జరిగింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద బోయింగ్ ఈ-3 సెంటినల్, కనీసం ఒక కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానంతో సహా అనేక అమెరికా వైమానిక దళ విమానాలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి.
ఈ సంఘటనలు అమెరికాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రతా భాగస్వామ్యం ప్రయోజనంపై సౌదీ అరేబియాలో ఆందోళనలను పెంచాయి. ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల భారీ దాడులు అమెరికా నేతృత్వంలోని వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించడంలో పదేపదే విజయవంతమయ్యాయి.
ఈ యుద్ధం వల్ల కలిగిన అత్యంత ముఖ్యమైన ప్రభావం ఏంటంటే, సౌదీ అరేబియా తన భద్రతా భాగస్వామ్యాలను విస్తరించే విధానాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ మార్పుల్లో అంత్యంత ముఖ్యమైనది పాకిస్తాన్‌తో ఉన్న భద్రతా భాగస్వామ్యంలో కనిపిస్తోంది.
ఏప్రిల్ 11, 2026న పాకిస్తానీ సైనిక దళాలు ధహ్రాన్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నాయని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబరు 2025లో కుదిరిన సౌదీ - పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కింద ఇది మొదటి అధికారిక మోహరింపు. నివేదికల ప్రకారం, ఈ మోహరింపులో సుమారు 13,000 మంది పాకిస్తానీ సైనికులు, పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఉన్నాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత సౌదీ అరేబియాలో పాకిస్తాన్ చేపట్టిన అతిపెద్ద సైనిక మోహరింపుగా దీన్ని పరిగణిస్తున్నారు.
మరోవైపు, యుక్రెయిన్ ఒక సాంకేతిక రక్షణ భాగస్వామిగా కూడా ఆవిర్భవించింది. 2026 మార్చి 27న, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ జెడ్డాలో పది సంవత్సరాల రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గల్ఫ్ దేశాల ఆలోచన మారిపోయిందా?
ఈ ఒప్పందం ప్రత్యేకంగా ఇరాన్ అభివృద్ధి చేసిన షాహెద్-136 డ్రోన్లను ఎదుర్కోవడంలో యుక్రెయిన్‌కు ఉన్న అనుభవం ఆధారంగా కుదిరింది.
2022 నుంచి యుక్రెయిన్ నగరాలపై రష్యా ఈ డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తోంది. నివేదికల ప్రకారం, యుక్రెయిన్ "డ్రోన్ ఒప్పందం"లో భాగంగా 200 మందికి పైగా డ్రోన్ నిరోధక నిపుణులను సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పంపింది.
ఈ సంఘర్షణ సమయంలో గ్రీస్ సైనిక దళాలు చురుగ్గా పాల్గొన్నాయి. 2021 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, హూతీ దాడుల నుంచి అరామ్కో మౌలిక సదుపాయాలను రక్షించడానికి గ్రీక్ సైనిక దళాలు అప్పటికే సౌదీ అరేబియాలో మోహరించాయి.
మార్చి 19, 2026న యన్బూలో మోహరించిన గ్రీస్ ఆధీనంలోని పేట్రియాట్ పీఏసీ-3 బ్యాటరీ, సమరేఫ్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకున్న రెండు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసింది. ఈ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి సౌదీ అరేబియాలో గ్రీక్ సైన్యం చేపట్టిన మొట్టమొదటి సైనిక చర్య ఇది.
ఆ సమయంలో అమెరికా విదేశాంగ విధానంలో ఎదురైన అత్యంత "సంక్లిష్టమైన, విభజన కలిగించే" సవాళ్లలో ఒకటిగా అమెరికా - సౌదీ సంబంధాలను రాస్ అభివర్ణించారు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని సూచిస్తుండగా, అమెరికా ప్రజాస్వామ్య విలువలు దానికి వ్యతిరేక దిశలో నెడుతున్నాయి.
డోనల్డ్ ట్రంప్‌కు సౌదీ అరేబియాతో సంబంధాలు ప్రధానంగా ఆయుధాల అమ్మకాలు. చమురు కోణంలోనే కనిపిస్తాయి.
ట్రంప్ రెండు పదవీకాలాల్లోనూ సౌదీ అరేబియా ఆయన తొలి ప్రధాన విదేశీ పర్యటనల్లో ఒకటిగా ఉంది. ఇదిలా ఉండగా జారెడ్ కుష్నర్ను ఇప్పటికీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు సన్నిహితుడిగా భావిస్తారు.
అయినప్పటికీ యుద్ధ సమయంలో ట్రంప్ యువరాజు బిన్ సల్మాన్‌ను బహిరంగంగా ఎగతాళి చేశారు. ప్రిన్స్ తనను, తన పరిపాలనను తక్కువ అంచనా వేశారని ట్రంప్ అన్నారు.
"చివరికి నన్ను పొగడాల్సి వస్తుందని వారు అనుకోలేదు" అని మయామిలో సౌదీ అరేబియా నిర్వహించిన ఒక పెట్టుబడి సదస్సులో ట్రంప్ అన్నారు.
జూన్ చివరి వారంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గల్ఫ్ దేశాలను సందర్శించారు, కానీ సౌదీ అరేబియాను సందర్శించలేదు. ఆయన బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాకు ప్రాంతీయ ప్రత్యర్థిగా పరిగణించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించారు.
గల్ఫ్ అరబ్ దేశాల దౌత్యవేత్తలు ప్రాంతీయ భద్రతపై తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి బహ్రెయిన్‌లో రూబియోను కలిశారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కూడా రూబియోను విడిగా కలిశారు.
"ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన క్షణం నుంచే, మొత్తం గల్ఫ్ ప్రాంతం ఆలోచనా విధానం మారిపోయింది. గల్ఫ్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎప్పుడైనా ఒత్తిడి తెచ్చే మార్గాలు ఇప్పుడు ఇరాన్‌కు లభించాయి" అని అమెరికా మాజీ రాయబారి మైకేల్ రాట్నీ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























