దేశంలో పాలనా మార్పు ఉండదు : ఆర్ఎస్ఎస్ చీఫ్

ఫొటో సోర్స్, @RSSorg
దేశంలో పాలన మార్పు ఉండదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.
ఫ్రాన్స్, అల్బేనియా, బంగ్లాదేశ్‌లోని అశాంతిని ప్రస్తావిస్తూ, సమస్యలకు పరిష్కారం కనుగొనడమే ఉద్యమాల లక్ష్యంగా ఉండాలని అన్నారు.
“పాశ్చాత్యంలో పుట్టిన ఈ తుపాను అన్నిరకాల వ్యవస్థలను వ్యతిరేకిస్తోంది” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు.
భారత్ వైవిధ్యాన్ని, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న పరపతిని ఆయన ప్రశంసించారు.
"భారత్, హిందువులు, ఆర్ఎస్ఎస్‌పై ప్రజల నమ్మకం పెరుగుతోంది" అని అన్నారు.
సంఘ్ స్థాపించి 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయదశమి వేళ మాట్లాడుతూ "మనం విడిపోయి బలహీనపడ్డాం. అందుకే బానిసత్వంలో మగ్గాల్సి వచ్చింది. ఎందరో మహానుభావుల కృషితో స్వాతంత్య్రం సాధించాం. మన మధ్య ఉన్న అనుబంధాలను మరోసారి గుర్తించాలి" అని అన్నారు.
“మన దేశంలో ప్రకృతి, మతాలు, కులాలు, ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో విషయాల్లో వైవిధ్యం ఉంది. వీటన్నింటినీ అంగీకరించి, గౌరవించే ఆలోచనా విధానం మనకు అవసరం. మన సనాతన సంప్రదాయం కూడా ఇదే చెబుతోంది” అన్నారు.


