లైవ్, బెంగళూరు నిరసనల్లో అభిజీత్ దీప్కే, ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు.

సారాంశం

  • జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆందోళనలు నిర్వహిస్తోంది.
  • హైదరాబాద్‌లో నిర్వహించిన చలో లోక్‌భవన్‌లో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
  • నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఎనిమిది యుద్ధాలను ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్నారు.
  • ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి

లైవ్ కవరేజీ

  1. కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి

    అనీ కార్సన్‌
    ఫొటో క్యాప్షన్, అనీ కార్సన్‌

    కెనడాకు చెందిన కవయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు అనీ కార్సన్‌కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది.

    76 ఏళ్ల కార్సన్ కవిత్వం, కల్పన, పరిశోధనాత్మక సాహిత్యాల మధ్య హద్దులను చెరిపివేసే రచనలకు విశేష గుర్తింపు పొందారు.

    సంప్రదాయ ప్రాచీన సాహిత్యంతో సరదాగా సంభాషిస్తూనే, సమకాలీన సాహిత్యానికి సరికొత్త రూపాలను సృష్టించిన ఆమె సాహసోపేతమైన, సృజనాత్మక రచనలకు గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.

    కార్సన్ ప్రాచీన గ్రీకు సాహిత్యాన్ని కూడా అనువదించారు. ఆమె 30 సంవత్సరాలకు పైగా క్లాసిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందించారు

  2. బెంగళూరులో సీజేపీ నిరసన.. అభిజీత్ దీప్కే, ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ హాజరు

    బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాక్రోచ్ జనతాపార్టీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌, అశుతోష్ రాంకాలతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధ్రువ్ రాఠీ పాల్గొన్నారు.

    సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ బెంగళూరులోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

    బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాక్రోచ్ జనతాపార్టీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌, అశుతోష్ రాంకాలతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధ్రువ్ రాఠీ పాల్గొన్నారు.

  3. ‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

    చలో లోక్ భవన్
    ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నిరసన

    ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.

    నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

    ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.

  4. ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు నోబెల్ శాంతి బహుమతి లభించాలి: ట్రంప్

    ట్రంప్, నోబెల్ శాంతి బహుమతి, అమెరికా, నార్వే

    ఎవరూ చేయనివిధంగా ఎనిమిది యుద్ధాలను ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి లభించాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    ‘‘బహుశా ప్రపంచం పూర్తిగా నాశనం కాకుండా నివారించాను. అందుకే నాకు నోబెల్ శాంతి బహుమతి లభించాలి. వాళ్ల నిర్ణయం ఏంటో నాకు తెలియదు. బహుశా నాలాంటివాళ్లకు ఇవ్వరనే అభిప్రాయం వాళ్లకున్నట్టుంది. ఇప్పుడా సమయం వచ్చిందేమో. పోయినసారి ఈ అవార్డు అందుకున్నవ్యక్తి చరిత్రలో అందరికన్నా అధ్యక్షుడు ట్రంప్ ఈ బహుమతికి ఎక్కువ అర్హుడని చెప్పారు. పరోక్షంగా ఇలా ఈ గౌరవం పొందడాన్ని నేను గౌవరంగా భావిస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.

  5. దిల్లీ: సీమాపురీలో కూలిపోయిన భవనం, నలుగురు మృతి, మరో ఎనిమిది మందికి గాయాలు

    దిల్లీ, బీజేపీ, ఆప్
    ఫొటో క్యాప్షన్, కూలిపోయిన భవనం

    దిల్లీలోని సీమాపురీ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.

    ఈ ఘటనలోఎనిమిది మంది గాయపడ్డారని డీఎం అజయ్ కుమార్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో చెప్పారు.

    "ఇప్పటివరకు ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. దీంతో పాటు చిన్నారిదిగా భావిస్తున్న మరో మృతదేహం కూడా లభ్యమైంది" అని ఆయన తెలిపారు.

    "శిధిలాలు రోడ్డుపై పడిపోవడంతో పాదాచారులెవరైనా వాటి కింద చిక్కుకున్నారో లేదో కచ్చితంగా చెప్పలేం. చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నాం. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి, ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. సహాయకార్యక్రమాలు పూర్తి కావడానికి ఇంకో నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టొచ్చు" అని ఆయన అన్నారు.

    ‘‘ఇది ఐదారంతస్థుల భవనం. దానిని 25 గజాల స్థలంలో నిర్మితమైంది. ఒకటి లేదా రెండేళ్ల క్రితం కట్టిందని అంచనా వేశారు. ఆ భవనంలో ఒక ముస్లిం కుటుంబం నివసిస్తోంది’’ అని ఆప్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.

  6. నిన్న అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

    నరేంద్రమోదీ, ఎల్‌కే అద్వానీ, బీజేపీ
    ఫొటో క్యాప్షన్, అద్వానీ, మోదీ

    ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు.

    ఈ సమావేశం నిన్న(అక్టోబర్ 7) జరిగిన్టటు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    ‘‘అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. దశాబ్దాలుగా అద్వానీ అందించిన ప్రజాసేవ, దేశానికి ఆయన చేసిన కృషి చెరగని ముద్రవేశాయి. దేశ ప్రగతిని బలోపేతం చేయడంలో అద్వానీది కీలకపాత్ర’’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

  7. ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తాం: కాంగ్రెస్

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ప్రియాంక గాంధీ, జంతర్ మంతర్, దిల్లీ, నిరసన
    ఫొటో క్యాప్షన్, ప్రియాంక గాంధీ

    ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్బంగా రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షనేతలపై పోలీసుల చర్యలను కాంగ్రెస్ ఖండించింది. ఇవాళ(గురువారం) దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

    భారత ప్రజాస్వామ్యం కోసం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ తెలిపింది.

    జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రెండు రోజులుగా దిల్లీలో కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది. నిరసనల సమయంలో మంగళవారం(అక్టోబర్ 6), బుధవారం(అక్టోబర్ 7)రాహుల్ గాంధీని, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత విడుదల చేశారు.

    జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 10న కాక్రోచ్ జనతాపార్టీ నిరసన చేపట్టనుంది.

  8. ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత

    నానా పాటేకర్ కన్నుమూత
    ఫొటో క్యాప్షన్, నానా పాటేకర్

    ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పాటేకర్ కన్నుమూశారు. 75ఏళ్ల నానా పాటేకర్ గోవాలో కన్నుమూసినట్టు ఆయన కుమారుడు మల్హర్ పాటేకర్ చెప్పారు. ఈ దురదృష్టకర వార్త నిజమేనని ధ్రువీకరించారు.

    ఈ ఉదయం 5.20గంటలకు తీవ్రమైన గుండెపోటుతో తన నివాసంలో పాటేకర్ మరణించారు.

    ‘‘45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా నానా పాటేకర్‌ను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు(ఎంఎల్‌సీ) నమోదు చేసినట్టు, పోస్ట్ మార్టమ్ నిర్వహించనున్నట్టు మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సాళ్కర్ తెలిపారు’’ అని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    దశాబ్దాలపాటు సాగిన కెరీర్‌లో హిందీ, మరాఠీ సినిమాల్లో ప్రముఖ నటుడిగా నానా పాటేకర్‌ గుర్తింపు పొందారు.

    పరిందా, ప్రహార్: ది ఫైనల్ అటాక్, క్రాంతివీర్, అగ్ని సాక్షి, ఖామోషీ: ది మ్యూజికల్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.

    నటనతో పాటు 'ప్రహార్: ది ఫైనల్ ఎటాక్' చిత్రానికి నానా పాటేకర్‌ దర్శకత్వం కూడా వహించారు. సినిమా, కళారంగానికి చేసిన సేవలకుగాను 2013లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

    నానా పాటేకర్‌ చివరిసారిగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ'రోమియో'లో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయింది. ప్రకాశ్ ఝా రాజకీయ డ్రామా సిరీస్ ‘సంకల్ప్’తో ఓటీటీలోకి ప్రవేశించారు.

    నానా పాటేకర్‌ తొలి హిందీ చిత్రం ‘గమన్’. 1978లో ఇది విడుదలయింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.

    2007లో వచ్చిన 'వెల్కమ్' అనే కామెడీ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ ఉదయ్ శెట్టి పాత్రతో ప్రేక్షకులను అలరించారు నానా పాటేకర్‌. సీక్వెల్ అయిన 'వెల్కమ్ బ్యాక్' (2015)లో కూడా అదే పాత్రను పోషించారు.

  9. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజ్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి