విడాకుల సెటిల్‌మెంట్‌: మాజీ భార్యకు రూ.17 వేల కోట్లు చెల్లించాలని ‘గేమింగ్ టైకూన్’కు కోర్ట్ ఆదేశం

క్వాన్ హ్యుక్-బిన్, విడాకుల సెటిల్‌మెంట్‌

ఫొటో సోర్స్, News1

    • రచయిత, కెల్లీ ఎన్‌జీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

గేమింగ్ దిగ్గజం క్వాన్ హ్యుక్-బిన్ తన మాజీ భార్యకు ఆస్తుల రూపంలో 2.55 ట్రిలియన్ వన్లు (సుమారు రూ.17,700 కోట్లు) చెల్లించాలని దక్షిణ కొరియా కోర్టు ఆదేశించింది.

ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన (పెద్ద మొత్తంతో కూడిన) విడాకుల సెటిల్‌మెంట్‌గా నిలిచింది.

క్వాన్ హ్యుక్-బిన్.. దక్షిణ కొరియాకు చెందిన మూడో అతిపెద్ద గేమింగ్ కంపెనీ 'స్మైల్‌గేట్' వ్యవస్థాపకుడు. ఆ దేశంలోని ధనవంతుల్లో ఒకరు. ఆయన నికర ఆస్తి విలువ 3 బిలియన్ డాలర్లు (రూ.28, 450 కోట్లు) అని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చెబుతోంది.

కోర్టు బుధవారం ఈ తీర్పు వెలువరించే వరకు 'స్మైల్‌గేట్' సంస్థ పూర్తిగా క్వాన్ యాజమాన్యంలోనే ఉండేది.

ఆ తీర్పు ప్రకారం, కంపెనీలో 2.5 ట్రిలియన్ వన్లు (సుమారు రూ.17 వేల కోట్ల) విలువైన 35% వాటాను ఆయన భార్య లీ హ్వా-జిన్‌కు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది.

అంతేకాకుండా, ఆమెకు అదనంగా 65 బిలియన్ వన్లు (సుమారు రూ.462 కోట్లను) నగదు రూపంలో చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది.

టెక్ దిగ్గజం చే తే వాన్ తన మాజీ భార్యకు 944 బిలియన్ వాన్లు (సుమారు రూ.6700 కోట్లు) చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు అదే రికార్డు. ప్రస్తుత సెటిల్‌మెంట్ దానికి రెండింతల కన్నా ఎక్కువ.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విడాకుల పిటిషన్‌లో స్మైల్‌గేట్‌లో లీ 50శాతం వాటా కోరారు.

బ్లూమ్‌బర్గ్ ప్రకారం.. కంపెనీని స్థాపించే క్రమంలో లీ ఆర్థికంగా సహాయం చేసినట్లు ఆమె తరపు న్యాయవాదులు వాదించారు.

2001లో క్వాన్, లీ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతి ఏడాదే క్వాన్ స్మైల్‌గేట్‌ని స్థాపించారు. క్రాస్‌ఫైర్, లాస్ట్ ఆర్క్ వంటి ప్రముఖ గేమ్‌లను ఆ సంస్థ రూపొందించింది.

20 ఏళ్లకు పైగా తమ పిల్లల బాగోగులు, ఇంటిని చూసుకున్నాని లీ చెప్పారు.

అయితే కంపెనీలో మాత్రం లీ ఎలాంటి పెట్టుబడి గానీ, పని గానీ చేయలేదని క్వాన్ వాదించారు. కంపెనీ ప్రాథమిక పెట్టుబడి మొత్తం క్వాన్‌దే అని ఈ ఏడాది తొలినాళ్లలో స్మైల్‌గేట్ ఓ ప్రకటన విడుదల చేసింది.

స్మైల్‌గేట్ ప్రధాన వాటాదారు వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యానించడానికి ఆ సంస్థ ప్రతినిధి ఒకరు నిరాకరించారు.

ది చోసన్ డైలీ మీడియా కథనం ప్రకారం, "మేం ఎప్పటిలాగే మా కర్తవ్యాలను నిబద్ధతతో నిర్వర్తిస్తాం" అని ఆ ప్రకటనలో సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

క్వాన్, లీ.. ఇద్దరికీ కోర్టు తీర్పును సవాలు చేసే అవకాశం ఇంకా ఉంది.

ఈ ఏడాది జులైలో కార్పొరేట్ దిగ్గజం, ఎస్‌కే గ్రూప్ ఛైర్మన్ చే తే వాన్ తన మాజీ భార్యకు 944 బిలియన్లు వన్లు (రూ.6700 కోట్లు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుత తీర్పునకు ముందు కొరియా చరిత్రలో ఇదే అత్యంత భారీ విడాకుల సెటిల్‌మెంట్.

అయితే, ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. లెక్కింపులో తప్పిదాల వల్ల ఆ దంపతుల ఆస్తుల విలువ పెరిగిపోయిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసును సమీక్షించాలని ఆదేశించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)