ఆర్టెమిస్ 2: నలుగురు వ్యోమగాములకు 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు ఎందుకు తెగిపోయాయి? అప్పుడు వారేం చేశారు?

    • రచయిత, రెబెక్కా మొరెల్(సైన్స్ ఎడిటర్), అలిసన్ ఫ్రాన్సిస్, కెవిన్ చర్చ్ (జాన్సన్ స్పేస్ సెంటర్)
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆర్టెమిస్ ఆస్ట్రోనాట్‌లు కాకుండా వేరే ఎవ్వరూ ఇంతవరకు భూమి నుంచి అంత దూరం ప్రయాణించలేదు.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11గంటల30 నిమిషాల సమయంలో ఆర్టెమిస్ 2 సిబ్బంది కొత్త రికార్డు నెలకొల్పారు. మనుషులు భూమి నుంచి ప్రయాణించిన అత్యంత దూరం రికార్డును బద్ధలు కొట్టారు.

1970లో అపోలో 13 సిబ్బంది నెలకొల్పిన 2 లక్షల 48 వేల 655 మైళ్ల (4,00,171 కిలోమీటర్లు) దూరం ప్రయాణించిన రికార్డును ఆర్టెమిస్ 2 సిబ్బంది అధిగమించారు.

చంద్రుడి వెనుక వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి నుంచి అత్యధిక దూరం చేరుకుంది. 2 లక్షల 52 వేల 756 మైళ్ల(4,06,771 కిలోమీటర్లు) రికార్డు దూరం ప్రయాణించింది.

ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి వెనుకభాగం నుంచి వెళ్లినప్పుడు భూమిపైన ఉన్న నాసా కేంద్రంతో సంబంధం కోల్పోయింది. 40 నిమిషాల పాటు ఇలా సంబంధాలు తెగిపోయాయి.

1) భూమితో సంబంధాలు ఎందుకు తెగిపోయాయి?

ఆర్టెమిస్ సిబ్బందికి భూమి చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ టెక్సాస్, హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌తో వాళ్లకు నిరంతరం సంబంధం ఉంటుంది. నాసా బృందం ప్రశాంతంగా మాట్లాడే మాటలు సిబ్బందికి ఇంటికి దగ్గరగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

ఆ సంబంధం కూడా కొన్ని నిమిషాలు వారు కోల్పోయారు.

వ్యోమగాములు చంద్రుడి వెనక్కి వెళ్లినప్పుడు భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో చంద్రుడు ఈ అనుసంధానికి అంతరాయం కలిగించాడు.

స్పేస్‌క్రాఫ్ట్‌కు, భూమికి మధ్య కమ్యూనికేషన్‌ జరిపే రేడియో, లేజర్ సిగ్నల్స్‌ను చంద్రుడు అడ్డుకున్నాడు.

దాదాపు 40 నిమిషాల పాటు నలుగు వ్యోమగాములు భూమితో ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఒంటరిగా ఉన్నారు.

''మేం చంద్రుడి వెనక్కు వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరితో సంబంధాలు కోల్పోయినప్పుడు దాన్నొక అవకాశంగా తీసుకోండి. మాకోసం ప్రార్థించండి. ఆశాభావంతో ఉండండి. మేం సిబ్బందితో తిరిగి అనుసంధానమయ్యేలా మీ మంచి ఆలోచనలు, భావాలు పంచుకోండి'' అని ఇదంతా జరగడానికి ముందే ఆర్టెమిస్ పైలట్ విక్టర్ గ్లోవర్ కోరారు.

భూమితో మళ్లీ అనుసంధానమైన తర్వాత ఆర్టెమిస్ మిషన్ నిపుణులు క్రిస్టినా కోచ్ ''హూస్టన్, ఇంటెగ్రిటీ, కమ్యూనికేషన్ చెక్'' అని మొదటగా మాట్లాడారు.

మళ్లీ భూమి నుంచి మీ గొంతు వినడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

తర్వాత వ్యోమగాములు కొంతసేపు విశ్రాంతి తీసుకుని సంపూర్ణ సూర్యగ్రహణాన్ని గమనించారు.

ఇది దాదాపు గంటపాటు సాగింది.

ఈ అనుభవాన్ని వివరించడానికి సరిపడా మాటలు లేవని, ఇది అద్భుతమైన అనుభవమని వారు తెలిపారు.

2) ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా?

గతంలో అపోలో వ్యోమగాములు కూడా చంద్రునిపై మిషన్ల సమయంలో సిగ్నల్ కోల్పోయారు.

అపోలో 11లో ప్రయాణించిన మైఖేల్ కొలిన్స్‌కి ఈ అనుభవం ఎక్కువ.

1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుని ఉపరితలంపై మొదటి అడుగులు వేసి చరిత్ర సృష్టించినప్పుడు చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న కమాండ్ మాడ్యూల్‌లో కొలిన్స్ ఒంటరిగా ఉన్నారు.

ఆయన కమాండ్ మాడ్యూల్ దూరంగా వెళ్తున్న కొద్దీ చంద్రుడి ఉపరితలంతో, మిషన్ కంట్రోల్‌తో 48 నిమిషాలు సంబంధలు పూర్తిగా నిలిచిపోయాయి.

తన పుస్తకం ‘క్యారీయింగ్ ది ఫైర్‌’లో ఆయన తన అనుభవాన్ని వివరించారు. ఒక్కడినే ఉన్నట్టు అనిపించిందని, జీవితం నుంచి దూరంగా వెళ్లిపోయినట్టు అనిపించిందని, కానీ ఒంటరితనం భావన రాలేదని ఆయన తెలిపారు.

రేడియో సైలెన్స్ వల్ల లభించిన ప్రశాంతత, నిశ్శబ్దం వల్ల మిషన్ కంట్రోల్ నుంచి వచ్చే నిరంతర సూచనలు, అభ్యర్థనల నుంచి విరామం దొరికిందని తర్వాతి ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పారు.

3) భవిష్యత్‌లో చంద్రుడిపైకి ప్రయాణాల్లోనూ ఈ అంతరాయం తప్పదా?

భూమి మీద నుంచి చూస్తే స్పేస్ క్రాఫ్ట్‌తో అనుసంధానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేవాళ్లకి ఈ బ్లాక్అవుట్ టెన్షన్ కలిగించే సమయం.

వాయువ్య ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లో గూన్‌హిల్లీ ఎర్త్ స్టేషన్‌లో ఉన్న భారీ యాంటెన్నా ఓరియన్ క్యాప్యూల్ నుంచి సిగ్నల్స్‌ను సేకరించింది. దాని ప్రయాణాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అదెక్కడుందనేదానికి సంబంధించిన సమాచారాన్ని నాసా హెడ్‌క్వార్టర్స్‌కు చేరవేసింది.

''మనుషులు ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌ను మేం ట్రాక్ చేయడం ఇదే మొదటిసారి'' అని గూన్‌హిల్లీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసనర్ మాట్ కాస్బీ బీబీసీతో చెప్పారు.

కానీ ఇలా కమ్యూనికేషన్ లేకుండా పోవడం భవిష్యత్తులో జరగదని భావిస్తున్నారు. నాసా, ఇతర స్పేస్ సంస్థలు చంద్రునిపై స్థావరం నిర్మించడానికి, ఇతర పరిశోధననలకు ఇది తప్పనిసరని కాస్బీ చెప్పారు.

''చంద్రునిపై స్థిరంగా పరిశోధనలు సాగాలంటే కమ్యూనికేషన్ పూర్తిగా ఉండాలి. రోజంతా కమ్యూనికేషన్ ఉండాలి. చంద్రుని వెనకభాగంలో ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ ఉండాలి’’ అని తెలిపారు.

4) భూమితో సంబంధాలు తెగిపోయినప్పుడు ఆస్ట్రోనాట్స్ ఏం చేశారు?

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మూన్‌లైట్ లాంటి ప్రోగ్రామ్‌లు భవిష్యత్తులో నిరంతరాయంగా నమ్మదగ్గ కమ్యూనికేషన్ కోసం చంద్రుని చుట్టూ శాటిలైట్‌ల నెట్‌వర్క్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాయి.

ఆర్టెమిస్ వ్యోమగాముల విషయానికొస్తే భూమితో కాంటాక్ట్‌లో లేని సమయంలో వాళ్లు తమ దృష్టిమొత్తం చంద్రుడిపై కేటాయించారు.

చంద్రుణ్ని పరిశీలించడానికి వారు తమ సమయం మొత్తం కేటాయించారు. ఫోటోలు తీసుకున్నారు. చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేశారు. దాని అందాన్ని ఆస్వాదించారు.

చంద్రుని నీడనుంచి ఆర్టెమిస్ 2 బయటకు వచ్చిన తర్వాత, నాసాతో తిరిగి సంబంధాలు నెలకొన్న తర్వాత ప్రపంచానికి కాస్త ఉపశమనం కలిగింది.

చరిత్ర సృష్టిస్తున్న ఆ వ్యోమగామలు నమ్మశక్యంకాని తమ అనుభవాలను భూమికి తిరిగి వచ్చి తిరిగి అందరితో పంచుకోగలరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)