నోయిడా: కార్మికులు ఒక్కసారిగా ఎందుకు నిరసనలకు దిగారు, ప్రభుత్వం ఏం చెప్పింది?

చదివే సమయం: 4 నిమిషాలు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఇండస్ట్రియల్ కారిడార్‌లో సోమవారంనాడు పెద్ద ఎత్తున కార్మికులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు.

కొన్నిచోట్ల వారు విధ్వంసానికి, రాళ్ల దాడులకు పాల్పడటంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టారు.

నోయిడాలోని ఫేజ్-2, సెక్టార్ 60లోని ఫ్యాక్టరీల ప్రాంతాలలో విధ్వంసకాండలు, నిరసనలు జరిగాయి.

వేతనాల పెంపు, బోనస్, మెరుగైన పని వాతావరణం, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నివారించడానికి కమిటీ ఏర్పాటు వంటివి ఈ ప్రాంతాల్లోని కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లు.

సోమవారం ఉదయం జరిగిన ఈ నిరసనల కారణంగా నోయిడా-దిల్లీ మధ్య రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పనులకు వెళ్తున్న వేలమందికి ఇబ్బందులు కలిగించాయి.

నిరసనల నేపథ్యంలో పారిశ్రామిక యూనిట్లతో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని యూనిట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమావేశం అనంతరం కలెక్టర్ తెలిపారు.

గత రెండు మూడు రోజులుగా పారిశ్రామిక యూనిట్లతో యంత్రాంగం సమావేశాలు నిర్వహించిందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ వెల్లడించారు.

పారిశ్రామిక యూనిట్లకు జారీ చేసిన సూచనలు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు.

జీతాల గురించి అధికారులు ఏం చెప్పారు?

వేతన పెంపు కోరుతూ కార్మికులు గత మూడు రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే, జిల్లా యంత్రాంగం హామీలు ఇచ్చినప్పటికీ సోమవారం నిరసనలు మరింత తీవ్రమయ్యాయి.

నిరసనకు ఒక రోజు ముందు జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ కార్మిక శాఖ సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

‘‘ఓవర్‌టైమ్ పేమెంట్లు తప్పకుండా అందేలా చూస్తాం. ప్రతి కార్మికుడికి వారపు సెలవు ఇస్తాం. ఆ సెలవు రోజున పనిచేసినందుకు జీతం రెట్టింపు చేస్తాం’’ అని కలెక్టర్ తెలిపారు.

"నిబంధనల ప్రకారం కార్మికులందరికీ బోనస్‌లు అందుతాయి. కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, దీనిని అమలు జరిగేలా చూస్తాం. ఈ కమిటీకి ఒక మహిళ అధ్యక్షత వహిస్తారు" అని కలెక్టర్ వెల్లడించారు.

కలెక్టర్ చెప్పినదాని ప్రకారం,

  • ప్రతి నెలా 10వ తేదీలోపు కార్మికుల వేతనాలను ఏక మొత్తంలో వారి బ్యాంకు అకౌంట్‌లో వేస్తారు.
  • ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పే స్లిప్ జారీ అందజేస్తారు.
  • జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ కార్మికులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
  • అన్ని పని ప్రదేశాలలో కంప్లయింట్ బాక్సులను ఏర్పాటు చేసి, కార్మికులందరినీ గౌరవంగా చూసేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.

నోయిడాలో కార్మికుల నిరసన సందర్భంగా హింసను ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారని ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఆందోళనలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వ్యక్తులను, బయటి శక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.

ఇటు దిల్లీ పోలీసులు కూడా తాము పూర్తి అప్రమత్తతతో ఉన్నామని, అన్ని కీలక ప్రదేశాలలో తగినంత బలగాలను మోహరించామని తెలిపారు.

కీలక సరిహద్దు పాయింట్ల వద్ద బారికేడింగ్‌ను పెంచామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా తక్షణమే ఎదుర్కోవడానికి అదనపు పోలీసు బలగాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు, పారామిలిటరీ బలగాలను మోహరించామని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

అసలేంటీ ఆందోళనలు?

నోయిడాలో కార్మికులు ఆందోళనలు గత రెండు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి.

వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పొరుగున ఉన్న హరియాణాతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో తక్కువ వేతనాలు అందుతున్నాయంటూ కార్మికులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హరియాణాలో కనీస వేతనాన్ని ఇటీవలే సుమారు రూ.14,000 నుంచి రూ.19,000 కు పెంచారు.

కానీ, తమకు కనీస వేతనం రూ. 13,000 మాత్రమే అందుతోందని కార్మికులు చెబుతున్నారు. తమ కనీస వేతనాన్ని కనీసం రూ. 20,000కు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల డిమాండ్లకు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మద్దతు తెలిపారు.

"సామాన్య కార్మికులను, జీతభత్యాలు పొందే ఉద్యోగులను దోపిడీ చేస్తూ, పెట్టుబడిదారులకు మద్దతిచ్చే బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష విధానమే వేతనాల పెంపుపై నోయిడాలో ఆందోళనలకు కారణం" అని అఖిలేశ్ యాదవ్ 'ఎక్స్' లో రాశారు.

‘‘బీజేపీ పెట్టుబడిదారుల ఏటీఎంలను డబ్బుతో నింపుతోంది. కానీ కార్మికుల వేతనాల విషయానికి వస్తే మాత్రం వారి ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయి’’ అని అఖిలేశ్ విమర్శించారు.

మరోవైపు, ముజఫర్‌నగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తుందని అన్నారు .

‘‘ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు భద్రత కల్పించడంతో పాటు, ప్రతి కార్మికుడికి సరైన వేతనం అందేలా చూస్తుంది. మేం గత సంవత్సరమే అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాము. దాని సిఫార్సులను ఈ నెలలో అమలు చేయబోతున్నాము’’ అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)