80వ స్వాతంత్య్ర వేడుకలు: ఎర్రకోట నుంచి ప్రసంగించిన నరేంద్ర మోదీ, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న ప్రధాని

ఫొటో సోర్స్, ANI
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ, త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఎర్రకోటకు చేరుకున్న ప్రధాన మంత్రికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఆ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, Doordarshan National
ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'వందేమాతరం' గురించి ప్రస్తావించారు.
"ఇది ఒక చారిత్రక దినం. స్వాతంత్య్రం తర్వాత ఎర్రకోటల నుంచి 'వందేమాతరం' ప్రతిధ్వనించడం ఇదే మొదటిసారి" అని ప్రధాని మోదీ అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు.
దేశ ప్రజల సంకల్పం, కృషి వల్ల అభివృద్ధి కొత్త ఊపు అందుకుందని ఆయన అన్నారు.
"గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. దేశ ప్రజల కృషి ఫలితంగా భారతదేశం ఒక పెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది" అని ప్రధాన మంత్రి అన్నారు.

ఫొటో సోర్స్, Doordarshan National
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు దేశం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయిందని ప్రధాని మోదీ అన్నారు. 2014 నాటికి భారతదేశం ప్రపంచంలో "ఆర్థికంగా బలహీనంగా ఉండి అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేరింది. 12ఏళ్లలో అభివృద్ధి ఊపందుకుంది" అని అన్నారు
"రక్షణ రంగ ఉత్పత్తి నాలుగు రెట్లు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వ్యాపారం ఐదు రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగాయి. డిజిటల్ ఆవిష్కరణల రంగంలో కూడా భారతదేశం తనదైన ముద్ర వేసింది" అని ప్రధాని అన్నారు.
దేశంలో పేటెంట్ మంజూరుల సంఖ్య నాలుగు రెట్లు, డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ తన ప్రసంగంలో వివరించారు..
పేదల కోసం మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణ వేగాన్ని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. పేదల కోసం మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణం నాలుగు రెట్లు వేగవంతమైందని ఆయన అన్నారు. అంతేకాకుండా, దేశంలో మెట్రో నెట్‌వర్క్ కూడా వేగంగా విస్తరించిందన్నారు.

ఫొటో సోర్స్, ANI
అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

ఫొటో సోర్స్, ANI
రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ జాతీయ పండుగ మాతృభూమి పట్ల సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని, అవిశ్రాంత పోరాటాన్ని, సాటిలేని అంకితభావాన్ని గుర్తుచేస్తుంది. వారి ఆదర్శాలను స్వీకరించి, అభివృద్ధి చెందిన భారత దేశమనే సంకల్పాన్ని సాకారం చేసుకుందాం" అని ప్రధాన మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























