విమాన ప్రమాదంలో మృతి చెందిన ఐరాస ఉద్యోగి కుటుంబానికి రూ. 276 కోట్ల నష్టపరిహారం..

విమాన ప్రమాదంలో మరణించిన 157 మందిలో మైఖేల్ ర్యాన్ ఒకరు

ఫొటో సోర్స్, World Food Programme/PA

ఫొటో క్యాప్షన్, విమాన ప్రమాదంలో మరణించిన 157 మందిలో మైఖేల్ ర్యాన్ ఒకరు
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఇథియోపియాలో 2019లో జరిగిన బోయింగ్ 737 మ్యాక్స్ విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉద్యోగి మైఖేల్ ర్యాన్ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం కింద సుమారు రూ.276 కోట్లు దక్కనుంది.

మైఖేల్ ర్యాన్ ఐర్లాండ్‌కు చెందినవారు.

ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థపై మైఖేల్ ర్యాన్ భార్య కన్నోల్లీ ర్యాన్ సివిల్ దావా వేయగా... అమెరికాలోని షికాగోలో ఉన్న ఓ న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది.

జవాబుదారీతనం, న్యాయానికి కోర్టు ఇచ్చిన తీర్పు సూచికని కన్నోల్లీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రమాదంలో తమ బంధుమిత్రులను కోల్పోయినవారికి తమ కంపెనీ క్షమాపణలు చెబుతోందని వెల్లడించారు.

కుటుంబసభ్యులు నష్టపరిహారం పొందే హక్కును తాము గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమాన ప్రమాదంలో మరణించిన 157మందిలో మైఖేల్ ర్యాన్ కూడా ఉన్నారు. ఐర్లాండ్‌లోని క్లేర్ కౌంటీ స్థానికుడైన మైఖేల్ ర్యాన్ కార్క్ నగరంలో నివాసముండేవారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

యునైటెడ్ నేషన్స్ (యుఎన్)కు చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూఎఫ్‌పీ)లో మైఖేల్ ర్యాన్ ఇంజినీర్‌గా పనిచేసేవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"కీలకమైన మైలురాయి"

‘‘ఎంతటి పరిహారమైనా ఒక ప్రాణ నష్టాన్ని భర్తీ చేయలేదు. బాధిత కుటుంబం అనుభవించిన వ్యథను తీర్చలేదు. అయినప్పటికీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ మేరకు తీర్పు చెప్పిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు" అని ర్యాన్ భార్య తరపు న్యాయవాది స్టీవెన్ సీ మార్క్స్ అన్నారు.

న్యాయం కోసం కన్నోల్లీ దృఢ సంకల్పంతో పోరాడారని మార్క్స్ పేర్కొన్నారు. జవాబుదారీ కోసం తన అన్వేషణలో ఆమె వెన్నంటే నిలవడం తమ సంస్థ పాడ్‌హర్స్ట్ ఓర్సెక్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.

"ఈ తీర్పు ఒక చరిత్రాత్మక మైలురాయి అయినప్పటికీ, ఈ దుర్ఘటన పట్ల బోయింగ్‌ బాధ్యత వహించడానికి జరుగుతున్న ప్రయత్నాలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా అంతే ముఖ్యం" అని మార్క్స్ అన్నారు.

లయన్ ఎయిర్ ఫ్లైట్ 610, ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 302 అనే రెండు విమానా ప్రమాదాల్లో మరణించిన వారి బంధువులు, సన్నిహితులకు క్షమాపణలు చెబుతూ బోయింగ్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

"సెటిల్‌మెంట్ల ద్వారా దాదాపు బాధితులందరి డిమాండ్లను పరిష్కరించినప్పటికీ, న్యాయం కోసం కోర్టు ప్రక్రియను ఆశ్రయించడానికి వారికున్న హక్కును మేం గౌరవిస్తున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ర్యాన్ కుటుంబం న్యాయం కోసం పోరాడిందని వారి తరఫు లాయర్ స్టీవెన్ మార్క్స్ చెప్పారు

ఫొటో సోర్స్, Podhurst Orseck

ఫొటో క్యాప్షన్, ర్యాన్ కుటుంబం న్యాయం కోసం పోరాడిందని వారి తరఫు లాయర్ స్టీవెన్ మార్క్స్ చెప్పారు

"ప్రపంచవ్యాప్తంగా అతడి ప్రభావం ఉంది"

అఫ్గానిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఇథియోపియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో దుర్బలమైన ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సహకారం అందించడంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు మైఖేల్ ర్యాన్ ఎనలేని సేవలందించారని తమ మెమోరియల్ పేజ్‌లో యూఎన్ కొనియాడింది.

కొండచరియలు, వరదల నుంచి వేలాది రోహింజ్యా శరణార్థులను రక్షించడానికి బంగ్లాదేశ్‌లో ఆశ్రమాలు, ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో ర్యాన్ కీలక భూమిక పోషించారని ఐరాస పేర్కొంది.

2014-16 మధ్య కాలంలో లైబీరియాలో ఎబోలా వ్యాప్తిని అరికట్టడానికి మైఖేల్ ర్యాన్ వైద్య కేంద్రాలను నిర్మించారని యూఎన్ తెలిపింది.

"ప్రపంచవ్యాప్తంగా ర్యాన్ ప్రభావం ఉంది. కాబట్టి అతడిని ఎంతో మంది మిస్ అవుతారు. అయితే అతడి కుటుంబానికి మాత్రం ఇది ఎప్పటికీ తీరని లోటు" అని ఐరాస ఆ ప్రకటనలో పేర్కొంది.

ఇంతకీ ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్‌కు ఏం జరిగింది?

2019 మార్చి10న ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి ఉదయం 8 గంటల 38 నిమిషాలకు (అక్కడి కాలమానం ప్రకారం) ఈటీ302 విమానం టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లోకి ఎగిరిన 6 నిమిషాల తరువాత, అంటే 8:44కి, విమానాశ్రయానికి ఆగ్నేయంగా 30 మైళ్ల దూరంలో బిషోఫ్తు నగరానికి సమీపంలో క్రాష్ అయ్యింది.

ఈ భారీ ప్రమాదం వల్ల విమానంలోని రెండు ఇంజన్లు భూమిలో 10 మీటర్ల లోతున కూరుకుపోయాయి. దీంతో 28 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల పొడవు గల భారీ అగాధం ఏర్పడింది.

అయితే ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక విచారణలో విమానం సాధారణ స్థితిలోనే టేకాఫ్ అయినట్లు తేలిందని ఇథియోపియా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాద దర్యాప్తు సంస్థ తెలిపింది.

కానీ, ఆ తర్వాత కొద్దిసేపటికే, విమానం ఎగిరే కోణాన్ని కొలిచే రెండు సెన్సార్ల రీడింగ్ అందుకు భిన్నంగా రికార్డు అవుతూ వచ్చింది.

దీంతో ఆటోమేటెడ్ సేఫ్టీ సిస్టం విమానం ముందు భాగాన్ని కిందకు నెడుతూ వచ్చింది. లయన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదంలోనూ ఇదే తరహా రీడింగ్ నమోదైంది.

ఇథియోపియా అధికారులు 2019లో విడుదల చేసిన నివేదికలో ఈ ఆటోమేటెడ్ సేఫ్టీ వ్యవస్థను విడదీసేందుకు పైలట్లు తగిన చర్యలను తీసుకున్నారని తెలిపింది. విమానాన్ని నిలకడగా నడపడానికి వారు స్వయంగా ప్రయత్నించినప్పటికీ, ఆ వ్యవస్థ విమానం క్రాష్ అయ్యే వరకు కిందకు తోస్తూ వచ్చిందని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)