తిరుమల: శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాలను టీటీడీ ఏం చేస్తుంది? టన్నుల్లో వచ్చే ఈ జుత్తు చివరకు ఎక్కడికి చేరుతుంది?

ఫొటో సోర్స్, TTD
- రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో ఎక్కువమంది భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. తమ కోరికలు తీరితే తిరుమలలో గుండు చేయించుకుంటామని మొక్కుకుంటూ ఉంటారు.
స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని టీటీడీ ఇటీవల పేర్కొంది.
ఈ ఏడాది మే నెలలో 27వ తేదీ వరకు 12,43,063మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది. ఇక నిరుడు 2025 మేలో తలనీలాల మొక్కు తీర్చుకున్న వారు 10,18,370 మంది. అలాగే 2024 మే నెలలో 10,65,729మంది భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకున్నారు.
ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57, 580 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరి ఇలా టన్నులకొద్దీ వచ్చే ఈ తలనీలాలు ఎక్కడి వెళతాయి? టీటీడీ వాటిని ఏం చేస్తుంది?

ఫొటో సోర్స్, TTD
తలనీలాలను ఏం చేస్తారు?
తిరుమలలో లక్షలాది మంది భక్తులు సమర్పించే కేశాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ తలనీలాలను పలువురు హెయిర్ ఇండస్ట్రీయలిస్టులు ఈ-వేలం ద్వారా సొంతం చేసుకుంటూ ఉంటారు.
వీటితో తయారయ్యే విగ్గులు, హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ఉంది.
'తిరుపతి హెయిర్' అనే బ్రాండ్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు ఉంది. బొగ్గులా నల్లగా, పొడవుగా, మెరిసే ఈ జుట్టుకు పారిస్, లండన్ వంటి నగరాల ఫ్యాషన్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉందని టీటీడీ వెల్లడించింది.
ప్రాసెసింగ్
భక్తులు కొండపైన సమర్పించిన తలనీలాలను ముందుగా కొండపైనే సేకరించి భద్రపరుస్తారు. తరువాత వాటిని తిరుపతికి తరలిస్తారు. తిరుపతిలో వీటిని నాణ్యత ఆధారంగా వేరుచేసేందుకు, శుభ్రపరిచేందుకు ఓ పెద్దభవనాన్ని నిర్మించారు.
తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న ఈ భవనంలో తిరుమల నుంచి తీసుకువచ్చిన శిరోజాలను వాటి నాణ్యత ఆధారంగా ఆరు రకాలుగా వర్గీకరిస్తారు.
మొదటి రకం: 31 అంగుళాల కంటే ఎక్కువ పొడవు
రెండో రకం: 16–30 అంగుళాలు
మూడో రకం: 10–15 అంగుళాలు
నాలుగో రకం: 5–9 అంగుళాలు
ఐదో రకం: 5 అంగుళాల కంటే తక్కువ.
ఆరో రకం : తెల్లజుట్టు లేదా బూడిదరంగు జుట్టు
వీటిలో మొదటి రకానికి భారీ డిమాండ్ ఉంటుందని, 5వ రకానికి తక్కువ డిమాండ్ ఉంటుందని టీటీడీ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
ఇటీవల టీటీడీ నిర్వహించిన ఈ వేలంలో మొదటి రకం తలనీలాలకు కేజీ కనీస ధరను రూ. 72,082 రూపాయలుగా నిర్ణయించగా, 5వ రకం తలనీలాలకు కేజీకి కనీస ధర రూ.135 రూపాయలుగా టీటీడీ నిర్ణయించినట్టు, మొదటి రకం తలనీలాలు మొత్తం 600 కేజీలు, 5వ రకం తలనీలాలు మొత్తం 2,83,000 కిలోలు వేలంలో ఉంచారని ఈ ఆక్షన్స్ ఇండియా వెబ్‌సైట్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పొడవైన శిరోజాలకు డిమాండ్
పొడవైన శిరోజాలకు అత్యధిక ధర లభిస్తుండగా, మిగతా రకాల ధరలు అంతర్జాతీయ డిమాండ్, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం యూరప్‌తో పాటు ఆసియా, అమెరికా ఫ్యాషన్ మార్కెట్లలో కూడా తిరుమల జుట్టుకు మంచి డిమాండ్ ఉంది.
తిరుమలలో భక్తులు సమర్పించే శిరోజాలు పొడవు, నల్లని మెరుపు, సహజమైన వంకరలు , రెమీ హెయిర్ నాణ్యత కారణంగా, ఈ తలనీలాలకు యూరప్, ఆసియా దేశాలలో విగ్గులు, హెయిర్ ఎక్స్‌టెన్షన్‌ల తయారీకోసం డిమాండ్ ఎక్కువగా ఉందని టీటీడీ వెబ్‌సైట్‌లోని సమాచారం తెలుపుతోంది.
1938 నుంచి ప్రైవేటు సంస్థలు తలనీలాల సేకరణ, విక్రయాలను నిర్వహించగా, 1985 నుంచి టీటీడీ కల్యాణ కట్టల నిర్వహణతో పాటు తలనీలాల విక్రయాలను కూడా స్వయంగా మొదలుపెట్టింది.
మొదట్లో కొద్దిమంది ఏజెంట్ల ద్వారా వేలాలు నిర్వహించగా, 2011 నుంచి ఈ-వేలం విధానాన్ని ప్రవేశపెట్టడంతో టీటీడీకి భారీ ఆదాయం సమకూరుతోంది.
‘‘జుట్టు వేలాల్లో ధరలను కృత్రిమంగా తగ్గించే వ్యాపార వర్గాలను అరికట్టేందుకు టీటీడీ 2011లో ఎంఎస్‌టీసీ (మెటీరియల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) సహకారంతో ఈ-వేలం విధానాన్ని ప్రారంభించింది’’ అని గతంలో సుదీర్ఘకాలం తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.శ్రీనివాస రాజు బీబీసీకి తెలిపారు.
ఈ ఏడాది టీటీడీ ఈ వేలంలో గట్టి పోటీ ఉంటుందని ఈ-ఆక్షన్స్ ఇండియా వెబ్‌సైట్ అంచనా వేసింది.
టీటీడీ వేలం అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిందని, భక్తులు సమర్పించే తలనీలాలకు అంతర్జాతీయ సౌందర్య, విగ్ పరిశ్రమలలో ఎంతో డిమాండ్ ఉందని ఈ-ఆక్షన్స్ ఇండియా పేర్కొంది.
ఇటీవల సంవత్సరాలలో తిరుమల తిరుపతి దేవస్థానములకు భక్తుల తలనీలాల ద్వారా సమకూరే ఆదాయం ఏటా పెరుగుతోంది. 2020 -21లో రూ. 67 కోట్ల ఆదాయం రాగా, 2021-22లో రూ. 75 కోట్లు, 2022 -23లో రూ.135 కోట్లు, 2023 -24లో రూ. 167 కోట్ల ఆదాయం సమకూరింది.
2024 -25లో రూ. 190 కోట్ల ఆదాయం వస్తుందని అంచనావేసిన అధికారులు, రాబోయే రోజులలో రూ. 200 కోట్లను దాటొచ్చని భావిస్తున్నట్లు ఎన్డీటీవీ చానెల్ వెబ్‌సైట్ ఒక కథనంలో పేర్కొంది.
నిత్యం ఎంతమంది?
తిరుమల శ్రీనివాసునిడి ప్రతిరోజూ 70 నుంచి 90వేలమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వేసవి సెలవులు, ప్రత్యేక పర్వదినాలలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంటుంది.
భక్తుల సంఖ్యకు అనుగుణంగానే తలనీలాలు సమర్పించేవారి సంఖ్య ఉంటుంది.
తాజాగా జూన్ 29వ తేదీన శ్రీవారిని 95,498 మంది భక్తులు దర్శంచుకున్నారని, 30,231మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ తెలిపింది.
ప్రతినిత్యం ఇంతభారీ స్థాయిలో భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటుండటంతో టీటీడీ కూడా ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తిరుమలలో ప్రధాన కల్యాణ కట్టతో పాటు మొత్తం 11 ప్రాంతాలలో మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉంచింది.
అలాగే మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు.
వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, TTD
40మంది భక్తులకు ఒక క్షురకుడు
ఒక్కో క్షురకుడు తమ విధుల్లో భాగంగా 6 గంటల షిఫ్టులో 40 మందికి క్షుర కర్మ చేస్తారు. రద్దీ రోజులలో టీటీడీ అదనంగా 250మందికి విధులు కేటాయిస్తూ ఉంటుంది.
వేలమంది భక్తులు వచ్చే చోట పరిసరాలు శుభ్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటన్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులకు కేటాయించే బ్లేడ్లను క్షురకులు ముందుగా సోడియం సొల్యూషన్ లో ముంచి ఆ తర్వాత డెటాల్‌తో శుభ్రపరుస్తారు.
భక్తులు తలనీలాలు సమర్పించడం పూర్తికాగానే, ఎప్పటికప్పుడు వాటిని సేకరించి భద్రపరుస్తారు. ప్రతి కల్యాణ కట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడి నీరు కూడా అందుబాటులో ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























