చైనాలో డోనల్డ్ ట్రంప్ పర్యటనపై నిపుణులు ఏమంటున్నారు?

డోనల్డ్ ట్రంప్, షీ జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

డోనల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించారు. గత తొమ్మిదేళ్ల కాలంలో అమెరికా నుంచి బీజింగ్‌కి వెళ్లిన మొదటి అధ్యక్షుడు ట్రంప్.

ఒకవైపు అమెరికా, భారత్ మధ్య సంబంధాలు అంత స్నేహపూర్వకంగా లేవు, మరోవైపు అమెరికా -ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

అమెరికా, చైనాల మధ్య.. సుంకాలు, వ్యూహాత్మక పోటీ, మాటల యుద్ధం వంటి అంశాలపై నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల మధ్య ఈ పర్యటన జరిగింది.

అయినప్పటికీ, ట్రంప్ షీ జిన్‌పింగ్‌ను గొప్ప నాయకుడిగా, స్నేహితుడిగా అభివర్ణిస్తూ ఆత్మీయత ప్రదర్శించారు.

దీనివల్ల ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తులు మరింత స్థిరమైన సంబంధాలను కోరుకుంటున్నాయనే సందేశం వెళ్లింది.

చైనా, అమెరికాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను భారతదేశానికి ముప్పుగా చూడలేనప్పటికీ దాని ప్రభావం మాత్రం చర్చనీయం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా, చైనా రెండూ భారత్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాములు.

భారత్ అనేక విషయాల్లో ఈ రెండు దేశాలపై ఆధారపడి ఉంది.

భారత్ మల్టీపోలార్ వరల్డ్, మల్టీపోలార్ ఆసియాను సమర్థిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చైనా పర్యటనను ఎలా చూడాలి?

చైనా, అమెరికా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ట్రంప్‌కు ఘన స్వాగతం పలికింది.

భారత్‌పై ప్రభావం

ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో మాట్లాడుతూ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలానీ ఏమన్నారంటే.. "ట్రంప్ బలహీన స్థితిలో ఉన్నప్పుడు బీజింగ్‌కు వెళ్లారు. దీనికి ఒక కారణం ఆయన ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం. ఇది స్వయంకృతాపరాధంగా మారింది. ఇది అమెరికాను చాలా చిన్న దేశంతో ఘర్షణలో ఇరుక్కునేలా చేసింది. అలాగే ఈ యుద్ధం అమెరికా వద్ద ఉన్న కీలకమైన ఆయుధాల నిల్వలను క్షీణింపజేసింది".

"మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ యుద్ధం అమెరికా బలహీనతలను కూడా బయటపెట్టింది. ఈ పరిణామాలన్నీ చైనాతో భవిష్యత్తులో యుద్ధం జరిగితే అమెరికా అందుకు సన్నద్ధంగా ఉందా? అనే సందేహాన్ని తైవాన్, జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర అమెరికా భాగస్వామ్య దేశాలకు కలిగించాయి" అని బ్రహ్మ చెలానీ అన్నారు.

"చైనా దిగుమతులపై, ముఖ్యంగా అరుదైన ఖనిజాలపై అమెరికా తీవ్రంగా ఆధారపడి ఉంది. ఈ ఆధారపడటాన్ని ఒక ఆయుధంగా వాడుకోగలమని బీజింగ్ నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చైనా విధానంలో ఘర్షణ నుంచి రాజీ వైపు మళ్లుతూ, నాటకీయంగా యూ-టర్న్ తీసుకున్నారు" అని ఆయన అన్నారు.

"ఇది ట్రంప్ చైనా విధానంలో పెద్ద మార్పు. దీని పర్యవసానంగా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ , భారత్‌తో కూడిన క్వాడ్‌కు ప్రాధాన్యం లేకుండాపోతోంది" అని ఆయన చెప్పారు.

నరేంద్ర మోదీ, పుతిన్, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ గతేడాది ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు చైనాలో పర్యటించారు.

చైనా విషయాల్లో అమెరికాకు భారత్ ప్రాధాన్యత

చైనాను ఎదుర్కోవడానికి భారత్ కీలక దేశమని అమెరికా చాలా కాలంగా భావిస్తోంది. కానీ ట్రంప్ రెండవ పదవీకాలంలో ఈ అభిప్రాయం మారిందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"చైనాతో భారత్ సంబంధానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక తర్కం ఉంది. ఇది చాలా వరకు అమెరికా విధానానికి అతీతంగా ఉంటుంది అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయంగా, అంతర్జాతీయంగా తీసుకున్న వైఖరి, భారత్‌–చైనా సంబంధాలను నిర్వహించాల్సిన వాతావరణాన్ని ప్రభావితం చేసింది" అని థింక్ ట్యాంక్, బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో అయిన తన్వి మదన్, ఈ ఏడాది మార్చిలో కార్నెగీ ఎండోమెంట్ ‌లో రాశారు.

" రెండవ పదవీకాలంలో ట్రంప్ భారత్-చైనా మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక సయోధ్యను వేగవంతం చేయడంతో పాటు, భారత వ్యూహాత్మక పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మార్చారు. చైనాతో పోటీపడే భారత సామర్థ్యంలోని కొన్ని అంశాలను పరిమితం చేశారు" అని మదన్ రాశారు.

"ప్రస్తుతం కొనసాగుతున్న చైనా-భారత్ వ్యూహాత్మక పోటీ కారణంగానే భారత్ అమెరికాతో సహకారాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. అమెరికాపై అధికంగా ఆధారపడటాన్ని, దానితో ముడిపడి ఉన్న అనిశ్చితులను నివారించేందుకు తన సామర్థ్యాలను, ఇతర భాగస్వామ్యాలను కూడా బలోపేతం చేసుకుంటోంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.

గతేడాది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించడం, ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ఆయన దిగిన ఫోటోలు, భారత్‌కి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని ట్రంప్‌కు, అమెరికా ప్రభుత్వానికి సంకేతం ఇవ్వడానికే అన్నట్టుగా ఉన్నాయి.

ఈ ఫోటోలు చూశాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో "భారత్, రష్యా పూర్తిగా చైనావైపు వెళ్లినట్టు కనిపిస్తోంది. వారిద్దరూ కలిసి సుదీర్ఘమైన, సుసంపన్నమైన భవిష్యత్తును కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను" అని రాశారు.

భారత్‌పై ట్రంప్ విధించిన భారీ సుంకాలు, చైనాతో సంబంధాలను స్థిరీకరించుకోవడానికి మోదీ ప్రభుత్వాన్ని ప్రేరేపించాయి. అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా భారత్ తన ఎగుమతులను చైనాతోపాటు వివిధ దేశాలకు విస్తరించింది. ఈ ప్రయత్నంలో భాగంగా భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.

"అమెరికా-భారత్ సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చైనాతో రాజీకి రావాలన్న ట్రంప్ స్పష్టమైన కోరిక, అమెరికా విశ్వసనీయతపై భారత్‌కు అనుమానాలు రేకెత్తించి ఉండొచ్చు. భారత్-చైనా మధ్య సంక్షోభం తలెత్తితే అమెరికా ఎలా స్పందిస్తుంది వంటి ప్రశ్నలు కూడా ఇది లేవనెత్తింది. సరిహద్దులో ఏ సంక్షోభం పెరగకుండా ఆపాలనే భారత ఆకాంక్షను ఈ పరిస్థితి మరింత బలపరుస్తుంది" అని మదన్ రాశారు.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

అక్టోబర్ 2025లో కార్నెగీ ఎండోమెంట్ వెబ్‌సైట్‌లో ఆష్లే టెల్లిస్ రాసిన ఒక సుదీర్ఘ వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ఆమె భారత్‌ పట్ల ట్రంప్ వైఖరిని వివరంగా చర్చించారు.

ఆష్లే టెల్లిస్, అమెరికా రక్షణ శాఖ, విదేశాంగ శాఖలలో పనిచేశారు.

"ట్రంప్ ఇటీవలి ప్రవర్తన వల్ల ఏర్పడిన అనిశ్చితులు సహజంగానే భారత్‌ని కలవరపెడుతున్నాయి. ఇవి అమెరికాతో సన్నిహిత భాగస్వామ్యానికి ముందుకు వెళ్లడాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే ఇది భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు కూడా అనుకూలమైనదే" అని టెల్లిస్ రాశారు.

"కానీ వాస్తవం ఏంటంటే అమెరికాకు సహకరించాలనుప్పటికీ, దాని ప్రభావానికి పూర్తిగా లొంగిపోకపోవడం అనే వైఖరి ట్రంప్ కంటే చాలా కాలం ముందు నుంచే ఉంది. చాలా కాలం నుంచే ఉన్న సాంస్కృతిక, వ్యూహాత్మక కారణాలే దీనికి కారణం. తనంతట తానుగా అగ్రరాజ్యంగా ఎదగాలనే దాని ఆశయానికి కూడా ఇది ముడిపడి ఉంది" అని ఆమె రాశారు.

టెల్లిస్ ఇలా రాశారు.. "ట్రంప్ గురించి భారత్‌కు ఉన్న ప్రస్తుత ఆందోళనలను అంగీకరించినప్పటికీ, ఇది ట్రంప్ చివరి పదవీకాలం అన్నది వాస్తవం. మరోవైపు చైనా విషయంలో భారత్‌కి ఉన్న వ్యూహాత్మక సందిగ్ధతలు చాలా పాతవి. అందువల్ల అమెరికాతో ఒక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని విస్మరించలేం. ఎందుకంటే చైనా శక్తి, దూకుడు వైఖరి భారతదేశానికి ఒక వ్యూహాత్మక అవసరం" అని ఆష్లే టెల్లిస్ రాశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)