భారత్‌లోనే అతిపెద్ద షేర్ సేల్స్ విదేశీ ఇన్వెస్టర్లను వెనక్కి తీసుకొస్తాయా?

రిలయన్స్ జియో

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

భారత అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్, అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రెండూ ఈ ఏడాది చివరిలో ఐపీఓకి రాబోతున్నాయి.

ఇవి దేశ క్యాపిటల్ మార్కెట్లకు మైలురాయిలాంటి లిస్టింగ్స్ కాబోతున్నాయని నిపుణులు అంటున్నారు.

బిలియనీర్ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్, ట్రేడింగ్ వాల్యూమ్ పరంగా టాప్ 3 ఈక్విటీ ఎక్స్చేంజీల్లో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) గత నెలలో కేవలం రోజుల వ్యవధిలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సంబంధించి తమ డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేశాయి.

మార్కెట్ నుంచి జియో సుమారు రూ.37,849 కోట్లను సేకరించాలని భావిస్తోంది. దీంతో వాల్యూయేషన్ రూ.11,35,638 కోట్ల నుంచి రూ.15,14,184 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.

అలాగే, ఎన్‌ఎస్ఈ రూ.31,230 కోట్లకు 6 శాతం ఈక్విటీని ఆఫర్ చేయనుంది. దీని వాల్యూయేషన్ రూ.5,39,429 కోట్లుగా ఉంటుందని అంచనా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

''ఈ భారీ ఆఫరింగ్‌ల అనూహ్యమైన స్థాయి, భారత మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను వివిధ రెట్లు పెంచగలదు. గత దశాబ్ద కాలంలో భారతీయులు నివసించే, వినియోగించే, పెట్టుబడి పెట్టే, లావాదేవీలు జరిపే విధానాల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు ఈ లిస్టింగ్స్ ప్రతీకగా నిలుస్తుండటంతో.. పెట్టుబడిదారులు వీటిని నిశితంగా గమనిస్తున్నారు'' అని ఎంకే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సీఈఓ యతిన్ సింగ్ బీబీసీతో అన్నారు.

''ఇలాంటి వ్యాపారాలు ఎప్పుడోగాని రూపుదిద్దుకోని ప్రత్యేక వ్యాపారాలు. సామాన్య భారతీయుని పొదుపులను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌ మార్కెట్లోకి మరలించే ఆర్థికీకరణ ప్రక్రియకు (ఫైనాన్షియలైజేషన్‌కు) ఎన్‌ఎస్ఈ ఒక ప్రత్యక్ష నిదర్శనం. అలాగే, ఒంటరిగా డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చి, అనేక సరికొత్త భారత వ్యాపారాలకు చోదక శక్తిగా నిలిచిన కంపెనీనే జియో'' అని సింగ్ తెలిపారు.

''దశాబ్దాల కిందట సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రధాన ఉత్పత్తులు భారత మార్కెట్లకు ఏ విధంగా కీలకమయ్యాయో, ఇప్పుడు వారి లిస్టింగ్‌లు కూడా అదే విధంగా కీలకమవుతాయి" అని ఆయన చెప్పారు.

జియో డేటా

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

ఆలస్యంగా ప్రవేశించి, గుత్తాధిపత్యం స్థాయికి ఎదిగింది

అత్యంత తీవ్రమైన పోటీ ఉన్న భారత టెలికాం మార్కెట్లోకి 2016లో రిలయన్స్ జియో ఆలస్యంగా ప్రవేశించింది. 17 ఆపరేటర్లు ఉన్న పరిశ్రమను ఏకం చేసి, దాదాపు రెండు కంపెనీల గుత్తాధిపత్యంగా మార్చేసింది. అదే సమయంలో... వందల మిలియన్ల కొత్త వినియోగదారులకు అంబానీలు దాదాపు ఉచితంగా డేటాను అందిస్తూ తీవ్రమైన ధరల యుద్ధానికి తెరలేపారు.

దశాబ్దం కిందట కేవలం 20 కోట్ల మంది భారతీయులే ఇంటర్నెట్‌ను వాడేవారు. ఈ సంఖ్య ప్రస్తుతం వంద కోట్లకు దగ్గర్లో ఉంది. కేవలం జియోకు మాత్రమే 52.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. చెల్లింపులు చేయడానికి, వెబ్ షోలు చూడటానికి, ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు దాని డేటాను ఉపయోగిస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వాడుతున్న అత్యంత ఎక్కువమంది వినియోగదారులు భారతీయులే. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లను భారత్ మించిపోయింది.

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిన జియో ఇచ్చే చవకైన టారిఫ్‌లే దీనికి ప్రధాన కారణం. ఈ డిజిటైజేషన్‌ ఫలితంగా దేశ ప్రజలు ఖర్చు చేసే డబ్బులు, సమయ విధానం పూర్తిగా మారిపోయింది.

జియో లాంచ్ అయిన సమయంలోనే అందుబాటులోకి వచ్చిన భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దాదాపు సున్నా డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్ స్థాయి నుంచి 2025 నాటికి 228 బిలియన్ల లావాదేవీల స్థాయికి చేరుకుందని బ్రోకరేజ్ సంస్థ జెరోధా తెలిపింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు పెయిడ్ సబ్‌స్క్రయిబర్లు 2019 నుంచి 2026 మధ్య కాలంలో 40 శాతం పెరిగారు.

"భారతీయుల నెలవారీ డేటా బిల్లులు తెలియకుండానే మూడింతలు పెరిగాయి. ఇది గ్రామీణ వేతనాల పెరుగుదల రేటు కంటే 3 రెట్లు ఎక్కువ" అని కోటక్ బ్యాంకు నివేదిక పేర్కొంది. ప్రజలు వీడియోలు చూడటానికి, సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించడానికి మరింత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుండటమే దీనికి కారణం.

కరోనా మహమ్మారి సమయంలో లక్షలమంది రిటైల్ (చిన్న) ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడంతో.. భారత్‌లో రిటైల్ పెట్టుబడులు విపరీతంగా పెరగడాన్ని ఎన్‌ఎస్‌ఈ పెరుగుదల ప్రతిబింబిస్తోంది.

చౌకైన మొబైల్ డేటా, స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడం కారణంగా.. ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతాల సంఖ్య 3 కోట్ల నుంచి 20 కోట్లకు ఎగిసింది.

ఎన్‌ఎస్ఈ

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

'భారత సరికొత్త ఆర్థిక వ్యవస్థకు రెండు ప్రధాన స్తంభాలు'

అనేక పాలనాపరమైన సమస్యలతో చాలాకాలంగా ఆలస్యమైన ఎన్‌ఎస్ఈ లిస్టింగ్... భారత మార్కెట్ మౌలిక సదుపాయాల పరిపక్వతను, ఇక్కడ పెట్టుబడిదారుల శ్రేణి విస్తృతమవ్వడాన్ని సూచిస్తుందని ఆనంద్ రాఠీ వెల్త్ లిమిటెడ్‌కు చెందిన ఫెరోజ్ అజీజ్ అన్నారు.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతి పెద్దవాటిలో నాలుగోది, 4.85 ట్రిలియన్ డాలర్ల విలువైన భారత స్టాక్ మార్కెట్‌కు ఈ ఎక్స్చేంజ్ వెన్నెముక. ఈ ప్లాట్‌ఫామ్‌పై జరిగే ప్రతి ట్రేడ్ ఎన్‌ఎస్‌ఈకి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ట్రేడింగ్ వాల్యూమ్‌లు వేగంగా పెరిగాయి.

లిస్టింగ్‌కు సిద్ధమైన జియో.. కేవలం టెలికాం కంపెనీగానే కాకుండా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

డేటా సెంటర్లను, భారతీయ భాషలపై శిక్షణ పొందిన అతిపెద్ద లాంగ్వేజ్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ఎన్విడియా, మెటాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా స్వదేశీ డిజిటల్, ఏఐ మౌలిక సదుపాయాలకు దిగ్గజంగా మారాలని ఇది కోరుకుంటోంది.

టారిఫ్‌ల పెంపు, అత్యధిక డేటా వాడకం, పోస్టు పెయిడ్ ప్లాన్లకు అప్‌గ్రేడ్ అవ్వడం వంటి వాటి ద్వారా మార్కెట్ షేరును పొందే దశ నుంచి మానిటైజేషన్ (డబ్బుల సమకూర్చుకునే దశకు) కూడా ఇది మారుతోందని ఎలారా సెక్యూరిటీస్ తెలిపింది. దేశీయ వినియోగదారుల మార్కెట్ మరింత అధునాతనంగా మారుతుందనడానికి ఇదొక సంకేతమని చెప్పింది.

''జియో, ఎన్‌ఎస్‌ఈలు భారత సరికొత్త ఆర్థిక వ్యవస్థకు రెండు ప్రధాన స్తంభాలుగా నిలుస్తున్నాయి'' అని అజీజ్ చెప్పారు.

ఒకేసారి ఈ రెండు కంపెనీలు లిస్టింగ్‌లకు వస్తుండటంతో.. గ్లోబల్ క్యాపిటల్‌ను ఆకర్షించే అవకాశం ఉంది. ఇవి పెట్టుబడి పెట్టడానికి అనువైన పరిధిని విస్తృతం చేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో భారత వృద్ధి కథనానికి కీలకమైన రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ నిధులకు మంచి అవకాశాలను కల్పిస్తాయి.

అయితే, ఈ లిస్టింగ్‌లు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలోకి తిరిగి వచ్చేందుకు సరిపోతాయా లేదా అన్నది అనిశ్చితంగానే ఉందని సింగ్ తెలిపారు.

ఎన్‌ఎస్ఈ లిస్టింగ్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ మార్కెట్లు అత్యంత అధ్వానంగా నడిచాయి. అమెరికాలో కనిపిస్తున్న అత్యధిక రాబడులు, ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో ఏఐ ఆధారిత అవకాశాల కోసం విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు.

పడిపోతున్న కరెన్సీ కూడా దేశంలోకి పెట్టుబడుల రాకను దెబ్బతీసింది.

దేశంలో అతిపెద్ద ఆర్థిక దిగ్గజాలైన పేటీఎం, ఎల్‌ఐసీ వంటి కంపెనీల షేరు అమ్మకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇటీవల కాలంలో చాలామంది చిన్న పెట్టుబడిదారులు తమ సంపదను కోల్పోయారు. అలాగే, డజన్ల కొద్ది హై-ప్రొఫైల్ ఐపీఓలు తమ లిస్టింగ్ ధరల కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి.

ఇవన్నీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.

ఈ ఇష్యూల ధరనే, వారి వ్యాపార విజయాన్ని వాటాదారులకు రాబడిగా మారుస్తుందా అన్న విషయాన్ని అంతిమంగా నిర్ధరిస్తుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)