నైజీరియా: ‘అక్రమ చెక్‌పోస్ట్ పెట్టి బాస్‌నే ఆపి డబ్బులు వసూలు చేసిన’ పోలీసులు

నైజీరియా, పోలీసులు, అవినీతి

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, మన్సూర్ అబూబాకర్
    • హోదా, అబుజా
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేయడానికి అక్రమంగా చెక్ పాయింట్ ఏర్పాటుచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నైజీరియా పోలీసులు అక్కడి యాంటీ కరప్షన్ ఏజెన్సీ హెడ్‌ను ఆపి దొరికిపోయారు.

నైజీరియాలో ‘కరప్ట్ ప్రాక్టీసెస్, అదర్ రిలేటెడ్ అఫెన్సెస్ కమిషన్’ హెడ్ మూసీ అలియూ దేశ రాజధాని అబుజాలో కారు నడుపుకుంటూ వెళ్తుండగా తనను కొందరు ఆపారని.. క్యాష్ మెషీన్ నుంచి 53వేల నైరాలు(సుమారు 38 డాలర్లు) విత్ డ్రా చేయాల్సిందిగా తనను ఒత్తిడి చేశారని తెలిపారు.

ఆ నలుగురు పోలీసులు అధికారిక విధులను వదిలిపెట్టి అక్రమంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారని పోలీస్ కమిషనర్ అహ్మద్ సనూసీ ఆరోపించారు.

వారిపై శాఖాపరమైన క్రమశిక్షణాచర్యలు తీసుకుంటున్నారు. వారు ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది. ఇలాంటి కేసులు కోర్టులు వరకు వెళ్లడం నైజీరియాలో అరుదు.

ఈ ఘటనపై అలీయు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో నిఘా ఆధారిత ఆపరేషన్ చేపట్టామని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ప్రధాన నిందితునిగా భావిస్తున్న పోలీసును ముందుగా అరెస్టుచేశారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు పోలీసులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘కోర్టుకు తీసుకెళ్తామని బెదిరించి’

ఈ ఘటన ఎలా జరిగిందో ‘బీబీసీ హౌసా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీయు వివరించారు.

నేను కారు ఆపిన వెంటనే ఓ పోలీసు నా కార్ డోర్ దగ్గరికి వచ్చారు. నేను విండో కిందకు దించాను. నా కారు ఓపెన్ చేయమని ఆయన చెప్పారు.

ఆ తర్వాత ఆ పోలీసు నా కారులోకి ఎక్కారు.

''ఆయన నా డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. నేను చూపించాను. అది తనకు ఇవ్వమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నన్ను కోర్టుకు తీసుకెళ్తానని ఆయనన్నారు. సరే నేను కోర్టుకు వెళ్తా అని చెప్పా.

కానీ ఆయన నన్ను కోర్టుకు తీసుకెళ్లలేదు. 'మీరు పెద్దమనిషి. మీ సమయం వృథా కావాలని అనుకోరు. కోర్టుకు వెళ్లినా మీకు 52వేల నైరాల ఫైన్ పడుతుంది'' అని నాతో చెప్పారు.

''మీ బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వండి. డబ్బులు బదిలీ చేస్తానని చెప్పా. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. దీంతో నేను ఏటీఎంకు వెళ్లి నగదు డ్రా చేసి ఇచ్చాను'' అని అలీయు తెలిపారు.

ఈ ఘటనపై నేషనల్ పోలీస్ చీఫ్ తీవ్రంగా స్పందించారు. అధికార దుర్వినియోగాన్ని ఇకపై ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.

''మీరు ఒకటి ఎంచుకోవాలి. పోలీసుగా ఉండాలా లేక దొంగగా ఉండాలా? అని సనూసీ అన్నారు.

''మీరు ఎంపిక చేసుకోకపోతే మీ చర్యలే మీరు ఏ వైపు ఉన్నారో నిర్ణయిస్తాయి'' అని హెచ్చరించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)