ఇస్రోలో ఎందుకీ ‘ప్రైవేటీకరణ’ అనుమానాలు? కీలక సాంకేతికతలనూ ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయనున్నారా

ఇస్రో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాకెట్ పని తీరును విద్యార్థులకు వివరిస్తున్న నిపుణుడు ( ఫైల్ ఫోటో)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణ అంశం చుట్టూ వివాదం రాజుకుంది.

ఇస్రో ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ ఆ సంస్థకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు చైర్మన్‌కు లేఖ రాయడం ఈ అంశంపై చర్చకు దారితీసింది.

అయితే, ఈ ప్రైవేటీకరణ అంశం 'నిరాధారమైనది' అని ఇస్రో చెబుతోంది.

ఇదే విషయంపై ఇండియన్ నేషనల్ - స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా 'ఎక్స్'లో స్పందించారు.

''భారత అంతరిక్ష రంగానికి ఇస్రో మూల స్తంభంగా ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాంకేతికతను బదలాయించే అంశం గతంలోనూ జరిగిందని, ముందు ముందు కూడా జరుగుతుందని మాత్రం చెబుతున్నారు.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) తరఫున ఇస్రో తయారు చేసిన ఎన్నో సాంకేతికతలు వాణిజ్య అవసరాలకు వాడుకునేందుకు స్టార్టప్‌లకు బదిలీ అయ్యాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

అయితే, ప్రైవేటు సంస్థల కారణంగా భారత అంతరిక్ష రంగం అభివృద్ధికి ఊతం ఇచ్చినట్లవుతోందని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన 'బీబీసీ' చెప్పారు.

ఇస్రో ప్రైవేటీకరణ, అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పవన్ గోయెంకా

'ప్రైవేటీకరణ'పై వివాదం ఎక్కడ మొదలైంది? పవన్ గోయెంకా ఏమన్నారు?

సెప్టెంబరు 5న జీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో జియో ఇమేజింగ్ శాటిలైట్స్‌ను ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది.

ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ఇస్రోలోని తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఇస్రో చైర్మన్ వి.నారాయణన్‌కు బహిరంగ లేఖ రాశాయి.

ప్రైవేటీకరణ, భవిష్యత్తులో ఇస్రో పాత్ర తదితర అంశాలను ప్రస్తావిస్తూ లేఖను విడుదల చేశారు ఉద్యోగులు.

ఉద్యోగ సంఘాల తరఫున ఇస్రోలోని 5వేల మంది ఉద్యోగులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని, మొత్తం 18,100 మంది ఉద్యోగులలో తమ సంఘాల ప్రతినిధులు 27శాతం మంది ఉన్నారని అందులో ప్రస్తావించారు.

అసలు ఈ వివాదానికి ఆగస్టులో ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఆగస్టు 21న 'బిజినెస్ టుడే' ఈవెంట్‌లో గోయెంకా మాట్లాడారు.

''రానున్న రోజుల్లో రాకెట్లు (లాంచ్ వెహికల్స్)ను ఇస్రో స్వయంగా తయారు చేయదు. వాటి తయారీ బాధ్యత ప్రైవేటు సంస్థలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగిస్తాం. ఇప్పటికే ఎస్ఎస్ఎల్వీ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే తయారువుతోంది.

రోజువారీ ప్రయోగాలకు ఉపయోగించే లాంచ్ వెహికల్స్ కాకుండా ప్రత్యేక సందర్భాలు, పరిశోధనలు, ప్రత్యేక కక్ష్యలో ప్రవేశపెట్టే రాకెట్లను తయారు చేసే సాంకేతికతపై ఇస్రో దృష్టి పెడుతుంది. ఆ తర్వాత ఆ టెక్నాలజీని కూడా ప్రైవేటు రంగానికి బదిలీ చేస్తుంది'' అని పవన్ గోయెంకా చెప్పారు.

ఇప్పటికే 120 రకాల టెక్నాలజీలను ప్రైవేటు సెక్టార్‌కు బదిలీ చేశామని చెప్పారు పవన్ గోయెంకా.

ఈ వ్యాఖ్యలు భారత అంతరిక్ష రంగంలో పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి.

పవన్ గోయెంకా వ్యాఖ్యలపై వివరణ కావాలంటూ లేఖ ద్వారా ఇస్రో చైర్మన్‌ను కోరాయి ఉద్యోగ సంఘాలు.

''పవన్ గోయెంకా వ్యాఖ్యలపై రాతపూర్వక వివరణ ఇవ్వగలరు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం లేదా స్పేస్ కమిషన్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లో తీర్మానం ఆమోదించారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి'' అని లేఖలో ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

''ఎల్వీఎం-3, పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ వంటి రాకెట్ల టెక్నాలజీని ప్రైవేటుకు బదలాయిస్తున్నారా అనే విషయంపై సమాధానం చెప్పాలి'' అని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.

ఇస్రో ప్రైవేటీకరణ

ఫొటో సోర్స్, skyrootaerospace

ఫొటో క్యాప్షన్, పవన్ కుమార్ చందన

రాకెట్ టెక్నాలజీల బదిలీకి ప్రణాళికలు

ఇస్రోకు చెందిన వివిధ టెక్నాలజీలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయనుందని పవన్ గోయెంకా వ్యాఖ్యలకు ముందే పీఐబీ వెల్లడించింది.

ప్రైవేటు రంగంలో రాకెట్ల తయారీ, ప్రయోగాల కోసం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ), లాంచ్ వెహికల్ మార్క్- 3(ఎల్వీఎం3) టెక్నాలజీ బదిలీకి ఇన్-స్పేస్ ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించింది.

ఇప్పుడు ఇదే విషయంపై ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుందో చెప్పాలని ఇస్రో ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

భవిష్యత్తులో ఇస్రో పాత్ర ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలను భవిష్యత్తులో రాకెట్ల తయారీ నుంచి మినహాయిస్తారా? ప్రజాధనంతో తయారు చేసిన టెక్నాలజీలను ప్రైవేటు రంగానికి బదిలీ చేస్తారా? ఇస్రో సంస్థాగత నిర్మాణంపై పడే ప్రభావమేంటి? ఉద్యోగ సంఘాలతో చర్చించారా? - ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ఉద్యోగులు తమ లేఖలో ప్రస్తావించారు.

ఉద్యోగులు లేవనెత్తిన సందేహాలపై పవన్ గోయెంకా, నారాయణన్‌ను బీబీసీ ఈ-మెయిల్ ద్వారా సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.

పవన్ గోయెంకా, ఇస్రో చెప్పింది ఏంటంటే...

మొత్తం వివాదంపై పవన్ గోయెంకాతో పాటు ఇస్రో కూడా 'ఎక్స్' వేదికగా స్పందించింది.

ఇస్రో భవిష్యత్తు గురించి మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చెందుతోందని, భారత అంతరిక్ష రంగంలో ఇస్రో పాత్రను తగ్గించే ఉద్దేశం లేదని పవన్ గోయెంకా చెప్పారు.

భారత అంతరిక్ష రంగంలో ఇస్రో మూలస్తంభంగా ఉంటుందని, భారత అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించేందుకు 2020 నుంచే సంస్కరణలు చేపట్టారని చెప్పారు.

''రాకెట్లు, శాటిలైట్లు, ఇతర వ్యవస్థలను పరిశ్రమలు తయారు చేస్తే, ఆధునిక సాంకేతికత, ఆర్ అండ్ డీ, సైంటిఫిక్ మిషన్స్, వ్యూహాత్మక మిషన్స్‌పై ఇస్రో దృష్టి పెడుతుంది. వీటిని తయారు చేయడం ప్రైవేటు సెక్టార్‌కు సాధ్యం కాదు'' అని పవన్ గోయెంకా చెప్పారు.

అంతరిక్ష రంగ సంస్కరణలు, భవిష్యత్తు లక్ష్యాలపై ఇస్రో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.

''ఇస్రో ముందుముందు చేపట్టబోయే పాత్రపై మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇస్రోను ప్రైవేటీకరిస్తారని లేదా దాని పాత్రను తగ్గించే ప్రయత్నం జరుగుతోందనే ఊహాగానాలు, తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా తప్పు, నిరాధారం'' అని ఇస్రో చెప్పింది.

ఇస్రో ప్రైవేటీకరణ

ఫొటో సోర్స్, Getty Images

'ఇస్రో పాత్రను తగ్గించడం కాదు'

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడమంటే ఇస్రో పాత్రను తగ్గించడం కాదని సంస్థ స్పష్టం చేసింది.

''భారత అంతరిక్ష రంగానికి నెక్ట్స్ జనరేషన్ సాంకేతికతల వృద్ధిపై ఇస్రోకు వీలు కల్పించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం'' అని చెప్పింది.

అంతరిక్ష రంగంలో భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రైవేటు రంగం కీలకమని స్కైరూట్ ఏరోస్పేస్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన చెప్పారు.

భారత తొలి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్ 'విక్రమ్ -1'ను స్కైరూట్ ఏరోస్పేస్ ఇటీవలే విజయవంతంగా ప్రయోగించింది.

''ఇస్రో, ప్రైవేటు స్పేస్ సెక్టార్‌లను కలిపే చూడాలి. అందులో ఇస్రో కీలకమైనది. ప్రైవేటు సెక్టార్ కంపెనీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండూ కలిస్తేనే భారత అంతరిక్ష రంగం ముందుకు సాగుతుంది'' అని ఆయన చెప్పారు.

ఇస్రో ప్రైవేటీకరణ

ఫొటో సోర్స్, Getty Images

స్పేస్ పాలసీ 'ప్రైవేటు'కు బూస్ట్

కేంద్ర ప్రభుత్వం 2023లో 'ఇండియన్ స్పేస్ పాలసీ' తీసుకువచ్చింది. 2024 ఫిబ్రవరిలో స్పేస్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

ఆ తర్వాత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు పెద్దఎత్తున వచ్చాయి. ప్రైవేటు కంపెనీల నియంత్రణ, ప్రోత్సాహకానికి ఇన్-స్పేస్ పనిచేస్తుంది.

భారత్‌లో 2033 నాటికి స్పేస్ ఎకానమీ (అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ) 45 బిలియన్ డాలర్ల (సుమారు 4,248,000 కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. ఇందులో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,038,000 కోట్లు )విలువైన ఎగుమతులు ఉంటాయని భారత్ అంచనా వేస్తోంది.

ఈ ఏడాది జులై నాటికి భారత్ స్పేస్ ఏకానమీ సుమారు 8.4 బిలియన్ డాలర్లుగా ఉందని పీఐబీ వెల్లడించింది.

2014లో ఒకే ఒక్క స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత స్టార్టప్‌లలో పెట్టుబడులు 618.5 మిలియన్ యూఎస్ డాలర్లకు (సుమారు రూ. 58,340 కోట్లు) చేరుకున్నాయి.

2021-22 లో ఈ పెట్టుబడులు 100.5 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 9,480 కోట్లు) ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి ఆరు రెట్లు పెరిగాయి.

ఈ ఆగస్టు నాటికి భారత్‌లో 440 స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌లు రిజిస్టర్ అయినట్లు డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా పోర్టల్ లెక్కలు చెబుతున్నాయని పీఐబీ రిపోర్టు చేసింది.

ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌లలో 18 స్టార్టప్‌లతో పాటు 52 ప్రభుత్వేతర సంస్థలకు కలిపి అంతరిక్ష రంగ కార్యకలాపాలు నిర్వహించేందుకు 113 ఆథరైజేషన్స్ దక్కాయి.

''ప్రైవేటు సెక్టార్ పురోగతి అనేది భారత అంతరిక్ష రంగానికి 'బూస్ట్' అవుతుంది. వేలాది ఉద్యోగాలు వస్తాయి. గత మూడేళ్లలో 5వేల ఉద్యోగాలు రాగా, బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రైవేటు స్పేస్ రంగంలోకి వచ్చాయని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి'' అని బీబీసీతో పవన్ కుమార్ చందన చెప్పారు.

ఇస్రో వినియోగిస్తున్న యంత్రాలలో 80శాతం భాగాలు ప్రైవేటు కంపెనీలే తయారు చేస్తున్నాయని చెప్పారు పవన్ కుమార్ చందన.

అంతరిక్షం, టెక్నాలజీ, రాకెట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్ - ఫైల్ ఫోటో)

ఇప్పటికే 'ఎస్ఎస్ఎల్వీ' సాంకేతికత బదిలీ పూర్తి

ఎస్ఎస్ఎల్వీ సాంకేతికతను 2025 సెప్టెంబరు 10న హెచ్ఏఎల్‌కు ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్), ఇన్-స్పేస్ సంయుక్తంగా బదలాయించాయి.

ఇవి కాకుండా ఇస్రో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ తయారు చేసిన దాదాపు 83 రకాల సాంకేతికతలను బదిలీ చేసేందుకు వివిధ సంస్థలతో ఇన్-స్పేస్ సమన్వయంతో 118 ఒప్పందాలు చేసుకుంది ఎన్ఎస్ఐఎల్.

ఇందులో ఎస్ఎస్ఎల్వీ సాంకేతికత సహా ఇండియన్ మినీ శాటిలైట్-1 బస్, ఇస్రో లేజర్ గైరో (ఐఎల్జీ), ట్రై బ్యాండ్ (ఎస్, ఎక్స్, క) యాంటెన్నా ఫీడ్, సిరామిక్ సెర్వో యాక్సెలెరోమీటర్ వంటి సాంకేతికతలున్నాయి.

2022లో అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఏరోస్పేస్, పిక్సెల్‌ మొదలైన స్టార్ట్ ప్పులకు వివిధ టెక్నాలజీల బదలాయింపు మొదలవగా.. ఇప్పటికీ స్పేస్ రంగంలో స్టార్ట్అప్పులకు టెక్నాలజీ బదలాయింపు కొనసాగుతోంది.

రానున్న సంవత్సరాల్లో కమర్షియల్ రాకెట్ల ప్రయోగానికి భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే స్కైరూట్ ఏరో స్పేస్ 2022లో సబ్ ఆర్బిటాల్ రాకెట్, 2026లో ఆర్బిటాల్ రాకెట్లను ప్రయోగించింది.

2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు రాకెట్ ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇన్-స్పేస్ ప్రకటించింది.

అలాగే 2027-28 ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రైవేటు రాకెట్ ప్రయోగాలు చేపట్టాలని అంచనా కాగా, ఆయా ప్రయోగాలకు ఇంకా అనుమతులు రావాల్సి ఉందని ఇన్-స్పేస్ చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)