లవ్ స్కామర్స్: ప్రేమ‌ పేరుతో తన తల్లిని మోసం చేస్తున్న వ్యక్తిని వెతుక్కుంటూ ఖండాలు దాటి వెళ్లిన ఓ యువకుడికి అక్కడేం తెలిసింది?

కార్లోస్ బారాగాన్

ఫొటో సోర్స్, Carlos Barragán

ఫొటో క్యాప్షన్, నైజీరియాలోని లాగోస్‌లో ఇకోటన్‌ జిల్లాలో కార్లోస్ బారాగాన్
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

‘‘వాళ్లంత స్మార్ట్ అని, తెలివైనవాళ్లనీ నేను అనుకోలేదు. వాళ్లను చూసి షాకయ్యా’’

ప్రేమ పేరుతో తన తల్లిని టార్గెట్ చేసి మోసం చేయాలనుకుంటున్న వ్యక్తిని వెతకడానికి కార్లోస్ బారాగాన్ నైజీరియాకు వెళ్లినప్పుడు, తాను ఒక తెలివైన మోసగాడిని కలుస్తానని కార్లోస్ ఊహించుకున్నారు.

తన తల్లిని మభ్యపెడుతూ ఆ వ్యక్తి పంపిన ఈమెయిళ్లు, ఆ వ్యక్తి చెప్పినట్లు సిరియాలోని ఒక అమెరికా సైనికుడి నుంచి వచ్చినవి కావు. నైజీరియాకు చెందిన ఒక ఐపీ చిరునామా నుంచి ఆ ఈ మెయిళ్లు వచ్చాయి.

కానీ, ఆ స్కామర్‌ ఎవరో గుర్తించే పనిని పక్కనబెట్టి, నైజీరియా 'యాహూ బాయ్స్' గురించి తెలుసుకునేందుకు కార్లోస్ అక్కడ నాలుగేళ్లు గడిపారు. చాలా తక్కువగా చదువుకుని, డబ్బు లేకపోవడంతో, జీవితంలో పెద్దగా లక్ష్యం లేని యువ మోసగాళ్లను తరచూ 'యాహూ బాయ్స్' అని పిలుస్తారు.

అక్కడ గడిపిన అనుభవం, తన తల్లిని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి గురించి ఆయనకున్న అభిప్రాయాలను మార్చడమే కాక, ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం చూపే ప్రభావం గురించి కూడా ఆలోచించేలా చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బ్రియాన్‌ను కలుసుకోవడం

కార్లోస్ తన తల్లి గురించి చాలా గర్వంగా ఉంటారు. ఆమె మనోధైర్యం కలిగిన స్వతంత్రురాలని, చదువుకుని, సొంతంగా డెంటల్ ప్రాక్టీస్ చేస్తున్నారనీ కార్లోస్ చెప్పారు. ఆమె మోసానికి గురవుతుందని ఎవరూ ఊహించలేరు. అయితే, ఆమె స్కామర్ల చేతిలో పడ్డారని అనుమానం మొదలైనప్పుడు, కార్లోస్, ఆయన సోదరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

కానీ, తన రొమాంటిక్ పార్టనర్ 'బ్రియాన్'కు పంపిన ఈమెయిల్ ద్వారా ఆమె ఎందుకు ఈ స్కామర్ల చేతిలో పడ్డారో ఆమె కొడుకులకు అర్థమైంది.

''మా అమ్మను చూసుకున్నా, ఆ తర్వాత చెల్లిని, నా భర్తను, పిల్లల్ని నేను చూసుకున్నా. ఇతరులను చూసుకోవడానికే నా జీవితమంతా సరిపోయింది. ఇప్పుడు నన్ను చూసుకోవడానికి ఒకరు కావాలనుకుంటున్నా'' అని బ్రియన్‌కు రాసిన మెయిల్‌లో కార్లోస్ తల్లి రాశారు.

విడాకులు తీసుకున్న తన తల్లి ఒంటరిగా ఫీలవుతున్నారని కొన్ని నెలల తర్వాత కార్లోస్ గుర్తించారు. టిండర్‌లో చేరమని ఆమెను ప్రోత్సహించారు.

అలా ఆమె టిండర్‌లో బ్రియాన్‌ను కలిశారు. తాను 50లలో ఉన్న ఒక ఆకర్షణీయమైన అమెరికా వ్యక్తిగా, సిరియాలో ఉంటున్నట్లు కార్లోస్ తల్లికి పరిచయం చేసుకున్నారు బ్రియాన్.

సైన్యంలో పనిచేసిన కార్లోస్ అన్నకు బ్రియాన్‌పై వెంటనే అనుమానం వచ్చింది.

"ఆయన మాటలు తేడాగా ఉన్నాయి. ఇది మోసం అయి ఉంటుందమ్మా" అని కార్లోస్ అన్న తన తల్లితో అన్నారు.

ఆ తర్వాత బ్రియాన్‌తో తన రిలేషన్‌ష్ గురించి కార్లోస్ తల్లి తన పిల్లలతో మాట్లాడటం మానేశారు. అయితే, అప్పుడప్పుడు బ్రియాన్ పంపిన ఈ మెయిల్‌లను ఆమె కార్లోస్‌కు చూపిస్తూ వచ్చారు.

తల్లితో కార్లోస్ బారాగాన్

ఫొటో సోర్స్, Carlos Barragán

ఫొటో క్యాప్షన్, తల్లితో కార్లోస్ బారాగాన్

ఆయన పంపిన ఈమెయిల్స్ అన్నీ కూడా ప్రేమ, అనురాగంతో నిండి ఉండేవి. త్వరలోనే ఇద్దరూ కలిసి ఉండటానికి స్పెయిన్‌కు వెళ్లడం గురించి ఈ ఈ మెయిల్స్‌లోనే బ్రియాన్ చర్చించడం మొదలుపెట్టారు. ఇది కార్లోస్ తల్లిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

‘‘అమ్మకు కూడా కాస్త అనుమానం వచ్చింది’’ అని కార్లోస్ అన్నారు.

అయితే, మీ ఇంటికి గోల్డ్ బార్స్ పంపిస్తానంటూ బ్రియాన్ చెప్పినప్పుడు, కార్లోస్ కుటుంబంలో గొడవ జరిగింది. చివరకు కార్లోస్ తల్లి రెండు ఉంగరాలతో ఇంటికి వచ్చి, త్వరలోనే బ్రియాన్, తాను కలిసి జీవించబోతున్నామని చెప్పినప్పుడు, ఇక ఏం చేయాలో కార్లోస్ నిర్ణయించుకున్నారు.

ఈ మెయిళ్లు నిజానికి లాగోస్ నుంచి పంపించారని కార్లోస్ తన తల్లికి సాక్ష్యంతో సహా చూపించినా ఆమెలో మార్పు రాలేదు. ఆ వ్యక్తిని నమ్మడం మానలేదు.

కొన్ని రోజుల తర్వాత, ఆమె చాలా ఈమెయిళ్లను తొలగించారు. కానీ, ఈ విషయంలో ఆమె చాలా బాధపడ్డారు.

ఒంటరితనంతో తన తల్లి బాధపడటం చూసి కార్లోస్‌లో కూడా మార్పు వచ్చింది. ఈ మోసగాడిని కనుగొనేందుకు, నైజీరియాకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.

కార్లోస్, ఇకోటన్ స్థానికులు

ఫొటో సోర్స్, Carlos Barragán

ఫొటో క్యాప్షన్, స్థానికుల గురించి తెలుసుకునేందుు ఇకోటన్‌లో గడిపిన కార్లోస్

బిగ్గీ, ఇకోటన్‌, యాహూ బాయ్స్

ఒక స్థానికుడి సహాయంతో కార్లోస్ 'బిగ్గీ' అనే మోసగాడి సహాయం తీసుకున్నారు.

స్నేహితులను కార్లోస్‌కు పరిచయం చేసేందుకు, లాగోస్ నగర శివారు ప్రాంతమైన ఇకోటన్‌ను చూపించడానికి బిగ్గీ అంగీకరించారు.

ఆ ప్రాంతంలో "ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు" అని బిగ్గీ అన్నారు.

సుమారు 20 ఏళ్లు అంటే దాదాపు కార్లోస్ వయసులోనే ఉన్న బిగ్గీ, చాలా తెలివైన, చలాకీ వ్యక్తి. వారిద్దరూ చాలా సమయం కలిసే గడిపారు. కార్లోస్‌కు బిగ్గీ అంటే ఇష్టం కలగడం మొదలైంది.

"ఆన్‌లైన్‌లో ఒంటరిగా ఉన్నవారితో రాత్రంతా మాట్లాడుతూ ఆయనలాంటి వ్యక్తి మోసగాడిగా ఎలా మారారు? అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను" అని కార్లోస్ చెప్పారు.

స్థానిక ప్రజలతో మాట్లాడుతూ.. అక్కడ ఒక భారీ స్కామర్ల నెట్‌వర్క్ ఉందని కార్లోస్ తెలుసుకున్నారు.

మొదట్లో వాళ్లు వాడిన ఈమెయిల్ సేవ పేరుతో 'యాహూ బాయ్స్' అని పిలిచే వందలాది మంది యువకులు అక్కడ ఉన్నారు.

ఒక మారుపేరు, నకిలీ ఈమెయిల్ చిరునామా మినహా ఇంకేమీ ఆధారాలు లేకుండా.. 24 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న దేశంలో తన తల్లిని మోసగించిన వ్యక్తిని తాను కనుగొనలేనని కార్లోస్‌కు మెల్లగా అర్థమైంది.

బదులుగా, 'యాహూ బాయ్స్' ప్రపంచం గురించి తెలుసుకోవడం ప్రారంభించారు కార్లోస్.

శ్వేతజాతీయుడైన యూరోపియన్‌గా, కార్లోస్ తాను ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు.

ప్రజలు తనను ఎఫ్‌బీఐ ఏజెంట్ అని లేదా చైనీస్ వ్యాపారవేత్త అని భావించేవారని ఆయన చెప్పారు. వారు ఆయనను 'మగా' అని పిలిచేవారు - అంటే తేలికగా మోసపోయే అమాయకపు వ్యక్తి అని అర్థం.

అయినప్పటికీ, బిగ్గీ పరిచయంతో, కార్లోస్ 50 మంది యాహూ బాయ్స్‌తో మాట్లాడగలిగారు.

వారిలో ఒకరు అమెరికన్ రెజ్లర్ కోడీ రోడ్స్‌గా నటిస్తూ, ఒక మహిళను మోసగించి 25 విమాన టిక్కెట్లకు డబ్బులు తీసుకున్నారు.

ఆయనకు మొదటిసారి 300 యూరోలు చెల్లించారు. ఇది ఆయన 18 నెలలకు పైగా ఫ్యాక్టరీలో పనిచేసి సంపాదించిన దానికంటే ఎక్కువ. కానీ, ఈ డబ్బులు తరచూ అంత త్వరగా రావు.

కార్లోస్ బారాగాన్

ఫొటో సోర్స్, Carlos Barragán

ఫొటో క్యాప్షన్, కార్లోస్ బారాగాన్

కార్లోస్ మరో యాహూ బాయ్ అజీజ్‌తో కూడా సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈయన 14 ఏళ్ల వయసు నుంచే ప్రజల్ని మోసం చేయడం ప్రారంభించారు.

అజీజ్ తన గ్రామం నుంచి లాగోస్‌కు వెళ్లి, తన తల్లి, చెల్లెలితో కలిసి ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు.

ఒక అందమైన శ్వేతజాతీయురాలికి చెందిన ఫోటో సంపాదించి, అమెరికన్ పురుషులకు తనను తాను 'వనెస్సా'గా పరిచయం చేసుకున్నారు.

ఆయన మొదట ఫెయిలయ్యారు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ అంత బాగుండేది కాదు. గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు, అంతేకాక అమెరికా వెళ్లిన సందర్భం కూడా లేదు.

"పాశ్చాత్య ప్రపంచం గురించి పెద్దగా తెలియని అబ్బాయిల గురించి మనం మాట్లాడుకుంటున్నాం" అని కార్లోస్ అన్నారు.

చివరికి, అజీజ్ ఒక మోసంలో 5 డాలర్లు సంపాదించారు. ఆ డబ్బును ఒక రెస్టారెంట్‌లో చికెన్ తినేందుకు ఖర్చు పెట్టారు. తొలిసారి ఆయన ఏసీ గదిలో గడిపారు.

అజీజ్ తల్లి, అమ్మమ్మ ఇద్దరికీ చదువురాదు. వీధిలో ఆహారం అమ్ముకునేవారు. ఆయన చేసేది తప్పని తెలుసుకుని, అజీజ్‌ను అమ్మమ్మ గట్టిగా హెచ్చరించారు. ఇలా మోసాలు చేయడం మానకపోతే కుటుంబం నుంచి వెలేస్తామని అన్నారు.

ఆ తర్వాత నుంచి ఆయన ఈ తరహా మోసాలను ఆపేశారు.

కార్లోస్, స్థానికులు

ఫొటో సోర్స్, Carlos Barragán

ఫొటో క్యాప్షన్, అజీజ్‌తో ఆయన తల్లితో స్నేహం పెంచుకున్న కార్లోస్

యువత ఇంతలా ఎలా మోసపోగలరు?

ఆ మోసగాళ్లు ఒక పకడ్బందీ నేర ముఠాలో భాగమై ఉంటారనే నమ్మకంతో తాను నైజీరియా వెళ్లానని కార్లోస్ చెప్పారు. కానీ, అజీజ్‌ను కలిసి తర్వాత.. కార్లోస్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

"పశ్చిమాఫ్రికాలో పనిచేస్తున్న శక్తివంతమైన ఒక నేర ముఠా మనల్ని మోసం చేస్తోందని నమ్మడం చాలా తేలిక. కానీ, నిజానికి, ఒక సెల్‌ఫోన్ ఉన్న ఈ యువకుడే మిమ్మల్ని మోసం చేస్తుండొచ్చు" అని ఆయన అన్నారు.

అయితే, స్కూల్ చదువులు కూడా పూర్తి చేయని కొంతమంది యువకులు కార్లోస్ తల్లి వంటి పెద్దవారిని ఎలా నమ్మించగలిగారన్నది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.

అయితే, కార్లోస్ తల్లిలాంటి వారితో కనెక్షన్ పెంచుకుంటే చాలని స్కామర్లు చెప్పారు.

''వారికి మీరు కాస్త సమయం కేటాయిస్తే చాలు. 'గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, లవ్? హౌ ఆర్ యూ, స్వీటి? లంచ్‌లో ఏం తిన్నావు' వంటి పదాలతో ఆకర్షించవచ్చు'' అని వారు కార్లోస్‌కు తెలిపారు.

ఒంటరితనంతో బాధపడుతున్న వారితో మాటలు కలపడానికి ఇలాంటివే ఉపయోగపడతాయని కార్లోస్ చెప్పారు. అలాగే, స్కామ్ బాధితులతో ఈ సంభాషణలను స్కామర్లు తరచూ చేసేవారని కార్లోస్ అన్నారు. .

"ఇది ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నేరం. ఎందుకంటే వాళ్లు కేవలం మీ డబ్బును మాత్రమే తీసుకోరు. మిమ్మల్ని మానసికంగా లొంగదీస్తారు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా కనుమరుగైనప్పుడు, మీలో ఒక శూన్యత ఏర్పడుతుంది. ఆ తర్వాత, సమాజం కూడా మిమ్మల్ని ఒక తెలివి తక్కువ వ్యక్తి అని, జరిగిన దానికి మీరే బాధ్యులని అంటుంది" అని ఒకరు కార్లోస్‌తో చెప్పారు.

కార్లోస్ తన అనుభవాల గురించి 'ది యాహూ బాయ్స్' అనే పుస్తకాన్ని రాశారు.

ఈ వార్త బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో ప్రసారమైన 'ఔట్‌లుక్' కార్యక్రమంలోని ఒక ఎపిసోడ్ ఆధారంగా అందిస్తున్నాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)