పాకిస్థాన్: క్వెట్టాలో రైల్వే ట్రాక్‌పై పేలుడు, 20మంది మృతి
పాకిస్థాన్‌లోని క్వెట్టాలో చమన్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్‌లపై ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.
పేలుడు కారణంగా రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీలు బోల్తా పడ్డాయి.
పేలుడు తీవ్రతకు రైల్వే ట్రాక్ దగ్గర నిలిపి ఉంచిన అనేక వాహనాలతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సైనిక, పోలీసు బలగాలను మోహరించారు. పేలుడుకు గల కారణం లేదా మృతుల సంఖ్యపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
క్వెట్టాలో జరిగిన పేలుడును రైల్వే మంత్రి మహమ్మద్ హనీఫ్ అబ్బాసి తీవ్రంగా ఖండించారు.
" క్వెట్టా కంటోన్మెంట్ నుంచి వస్తున్న షటిల్ రైలు చమన్ గేట్ దగ్గర పేలుడుకు గురైంది" అని రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి తెలిపారు.
పేలుడు కారణంగా ఇంజన్‌తో సహా మూడు కోచ్‌లు పట్టాలు తప్పగా, మరో రెండు కోచ్‌లు బోల్తా పడ్డాయని ఆయన చెప్పారు.