You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అబ్దుల్ రహీమ్: మరణశిక్ష తప్పించడానికి రూ.34 కోట్లు సేకరించి ఇచ్చారు, మరి సౌదీ జైలు నుంచి విడుదల ఎప్పుడు?
- కేరళ వాసి అబ్దుల్ రహీమ్‌కు సౌదీ అరేబియాలో మరణశిక్ష
- 17ఏళ్ల బాలుణ్ని హత్య చేసినట్టు ఆరోపణలు
- అబ్దుల్ రహీమ్‌ను రక్షించేందుకు 2011 నుంచి ప్రయత్నాలు
- ‘బ్లడ్ మనీ’ కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా భారీగా నిధుల సేకరణ
- సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల సాయం
- రూ.34కోట్ల కోసం క్రౌడ్ ఫండింగ్ మొదలుపెడితే ఖాతాలో రూ. 47కోట్లు జమ
- మరణశిక్షను గత ఏడాది యావజ్జీవ శిక్షగా మార్చిన సౌదీ కోర్టు
- మే 20తో పూర్తయిన శిక్ష
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
''మా అమ్మ ఫాతిమా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. కానీ అబ్దుల్ రహీమ్ తన కళ్ల ముందు కనిపించినప్పుడు మాత్రమే ఆమె దాన్ని నమ్ముతారు''
ఇవి అబ్దుల్ రహీమ్ సోదరుడు నసీర్ మాటలు.
అబ్దుల్ రహీమ్ కోసం ఒక క్రౌడ్‌సోర్సింగ్ యాప్ ద్వారా సం 34 కోట్లరూపాయలు సేకరించారు. బ్లడ్ మనీ (క్షమాభిక్షకు బదులుగా బాధిత కుటుంబానికి డబ్బులు ఇవ్వడం) కోసం ఈ డబ్బు పోగుచేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనికి సహకరించారు. కేరళవాసులు ఎక్కువగా ఇందులో భాగమయ్యారు.
ఈ స్థాయిలో డబ్బును భారత్‌లో ఇంతకుముందెప్పుడూ సేకరించలేదు.
నసీర్ ఇలా మాట్లాడడానికి కారణాలు 20 సంవత్సరాల క్రితం నాటివి. కోజికోడ్‌లో ఆటో డైవర్ వృత్తిని వదిలి డ్రైవర్‌గా పనిచేయడానికి సౌదీ అరేబియాకు వెళ్లాలని 2006 నవంబరులో రహీమ్ నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి ఈ కష్టం మొదలయింది.
అబ్దుల్ రహీమ్‌కు మరణశిక్ష ఎందుకు విధించారు?
కొత్త ఉద్యోగంలో చేరిన 28 రోజులకే పక్షవాతంతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుణ్ని చూసుకోవాల్సిన అదనపు బాధ్యతను రహీమ్‌కు అప్పగించారు. ఆ సమయంలోనే తన యజమాని కొడుకును రహీమ్ హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి.
కారు వెనక సీట్లో కూర్చోబెట్టి బాలుణ్ని రియాద్‌లో ఒక హైపర్‌మార్కెట్‌కు తీసుకు వెళ్తుండగా ఆయన శ్వాసతీసుకునే పరికరం పొరపాటున ఊడిపోయిందని రహీమ్ చెప్పారు.
''రహీమ్ అరెస్టు జరిగిన ఆరు నెలల తర్వాత మా నాన్నకు ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధలో మునిగిపోయారు. తీవ్రంగా ఆలోచిస్తుండేవారు. అందరికీ దూరంగా ఉండేవారు. ఆ పరిస్థితుల్లోనే కొన్ని నెలల తర్వాత ఆయన కన్నుమూశారు" అని నసీర్ చెప్పారు.
రెండేళ్ల క్రితం ''బ్లడ్ మనీ'' చెల్లించినప్పటి నుంచి రహీమ్ ఏదో ఒక రోజు తప్పకుండా ఇంటికి తిరిగి వస్తాడనే ఆశతో తల్లి జీవిస్తున్నారు.
ఏళ్లగా అనేక న్యాయస్థానాలలో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. మరణశిక్ష నుంచి క్షమాభిక్ష ప్రసాదించమని సౌదీ రాజుకు కూడా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ రహీమ్‌కు ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉన్నట్టే కనిపించింది.
రహీమ్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్ష మే 20తో పూర్తవడంతో ఆయన కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యుల్లో ఆందోళన పెరిగింది.
క్షమాభిక్ష కోసం బాలుడి కుటుంబంతో చర్చలు
"2011లో రహీమ్‌కు మరణశిక్ష విధించినప్పుడు ఆ బాలుడి తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టాం. 2024 జూన్ నాటికి మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చారు" అని అబ్దుల్ రహీమ్ న్యాయ సహాయ కమిటీ సభ్యులైన అష్రఫ్ వెంగాట్ బీబీసీతో చెప్పారు.
ఆ సమయంలో కమిటీ సభ్యులు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అప్పటి సంక్షేమ అధికారి యూసుఫ్ కున్నుమ్మల్‌తో కలిసి న్యాయపోరాటాన్ని కొనసాగించారు.
"2019 అక్టోబరులో ఒక న్యాయవాది ద్వారా తీవ్రస్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టాం. 2023 అక్టోబరునాటికి ఒక ఒప్పందం కుదరింది. బాలుడి కుటుంబం 15 మిలియన్ల సౌదీ రియాల్స్ లేదా (అప్పటి రేట్ల ప్రకారం) భారత కరెన్సీలో 34 కోట్లరూపాయలను ''బ్లడ్ మనీ''గా అంగీకరించింది'' అని యూసుఫ్ కున్నుమల్ తెలిపారు.
రహీమ్ కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నందున 'అబ్దుల్ రహీం లీగల్ అసిస్టెన్స్ కమిటీ'ని ఒక స్వచ్ఛంద ట్రస్ట్‌గా ఏర్పాటుచేశారు.
"మొదటి కొన్ని వారాల్లో క్రౌడ్‌సోర్సింగ్ యాప్ ద్వారా కేవలం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలే సమకూరాయి. ఆ తర్వాత స్థానిక చానెళ్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ఈ వార్త నలుమూలలకూ చేరింది. మా సోదరుడి కోసం డబ్బులు ఇవ్వాలని దేవాలయాలు, చర్చిలు కూడా విజ్ఞప్తి చేశాయి" అని నసీర్ చెప్పారు.
వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ (చెమ్మనూర్ జ్యువెలర్స్) కోటి రూపాయలు ఇచ్చారు. తర్వాత నిధులు సేకరించడానికి తిరువనంతపురంలో బస్సు టూర్ కూడా నడిపించారు.
రాజకీయ పార్టీల నేతలు, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా దీనికి సాయపడ్డారు.
'క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చింది రూ.34కోట్లు కాదు... 47 కోట్లు’
క్రౌడ్‌సోర్సింగ్ యాప్‌ను 2024 మార్చి 1న ప్రారంభించినట్టు అష్రఫ్ తెలిపారు.
"34 కోట్లరూపాయలు సమకూరాయి. అది రంజాన్ మాసంలో 27వ రోజు. బహుశా అందుకే ప్రజలు విరాళాలు ఇచ్చి ఉంటారు. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత చాలా విచిత్రమైన సంఘటన జరిగింది" అని ఆయన అన్నారు.
"ప్రజలు ఆ ఖాతాకు విరాళాలు ఇవ్వడం కొనసాగించారు. మొత్తం సొమ్ము 47 కోట్ల రూపాయలకు పెరిగింది. మా బ్యాంకు ఖాతాలో 13 కోట్లరూపాయలు అదనంగా జమ అయ్యాయి. ఈ అదనపు సొమ్ముతో ఏం చేయాలో రహీమ్ తిరిగి వచ్చిన తర్వాత కమిటీ నిర్ణయించాల్సి ఉంటుంది"
''కమిటీ ఆ 'బ్లడ్ మనీ'ని విదేశీ వ్యవహారాల శాఖకు అప్పగించగా, దానిని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపించారు''
"ఆ చెక్కును రియాద్ గవర్నర్ కార్యాలయానికి అప్పగించగా వారు దానిని కోర్టులో జమ చేశారు. రహీమ్‌కు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తున్నట్టు 2025 జూన్ 2న కోర్టు ప్రకటించింది" అని అష్రఫ్ తెలిపారు.
"ఆ లాయర్ సాయం లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఆ న్యాయవాది ఆ అబ్బాయి కుటుంబానికి బంధువు కూడా" అని యూసుఫ్ కున్నమ్మాళ్ అన్నారు.
భారత రాయబార కార్యాలయానికి చెందిన ఈ రిటైర్డ్ అధికారి సౌదీ అరేబియాలో తొమ్మిది మంది భారతీయులను మరణశిక్ష నుంచి కాపాడారు.
రహీమ్‌తో పాటు ఈ తొమ్మిది మందిలో పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు, కేరళకు చెందిన మరో ఐదుగురు ఉన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)