You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యూబా - అమెరికా మధ్య చిచ్చురేపిన విమాన దాడి.. రౌల్ క్యాస్ట్రోపై చార్జ్‌షీట్ వెనుక అసలు కథ
- రచయిత, అటాహ్యుల్పా అమెరైజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై నమోదైన క్రిమినల్ అభియోగాలకు 30 ఏళ్ల క్రితం ఫ్లోరిడా తీరంలో రెండు విమానాల కూల్చేయడమే ప్రధాన కారణమని బుధవారం అమెరికా వెల్లడించింది.
అమెరికా పౌర విమానంపై క్యూబా సైన్యం జరిపిన ఈ దాడి రెండు దేశాల మధ్య తలెత్తిన అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. దీని ప్రభావం నేటికీ కనిపిస్తూనే ఉంది.
ఒక పౌర విమానంపై క్యూబా సైన్యం జరిపిన ఈ దాడి క్యూబా - అమెరికా మధ్య నేటికీ ప్రభావం చూపేలా అత్యంత పెద్ద సంక్షోభాలలో ఒకటిగా నిలిచింది.
మయామిలోని క్యూబా ప్రవాసుల సమూహానికి చెందిన ఈ రెండు చిన్న విమానాలను క్యూబా ఫైటర్ జెట్స్ కూల్చేశాయి.
క్యూబా, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి మధ్య ఉన్న జలమార్గంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో విమానాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండించారు. అప్పట్లో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్న రౌల్ క్యాస్ట్రోపై కూడా అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దీంతో క్యూబాలోని ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం చేసింది.
దీనివల్ల అతని సోదరుడైన ఫిడెల్ క్యాస్ట్రో పాలనకు వ్యతిరేకంగా అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
అంతేకాకుండా, అమెరికా అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో క్యూబా తక్షణ చర్చలు జరిపే అవకాశాలను కూడా అడ్డుకుంది.
రౌల్ క్యాస్ట్రో 2021లో క్యూబా అధ్యక్ష బాధ్యతల నుంచి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. అయినప్పటికీ, ఇప్పటికీ ఆయనను దేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా చాలామంది భావిస్తారు.
క్యూబా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రౌల్ క్యాస్ట్రోపై ఈ చార్జ్‌షీట్ (ఇండిక్ట్‌మెంట్) నమోదైంది.
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం నుంచి ఏర్పడిన ఒత్తిడి, మదురో పతనం తర్వాత వెనెజ్వెలా నుంచి మద్దతు లేకపోవడంతో క్యూబా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
బ్లాకౌట్లు, ఆహార కొరతతో క్యూబాను వీడిన వేలాది మంది
క్యూబాకు ప్రధాన ఆర్థిక సహాయకారిగా ఉన్న సోవియట్ యూనియన్ 1990లలో కూలిపోవడంతో అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అదే సమయంలో ఈ విమాన దాడి జరిగింది.
దీనివల్ల క్యూబాలో విద్యుత్ కొరత (బ్లాకౌట్), ఆహార కొరత, ఇంధన కొరత ఏర్పడి దేశం ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి దిగజారింది.
ఆనాటి సంక్షోభం కారణంగా వేలాది మంది క్యూబా ప్రజలు, అమెరికాలో ఉన్న తమ కుటుంబాలను కలిసేందుకు క్యూబా విడిచి వెళ్లడానికి ప్రయత్నించారు.
''అప్పట్లో ఫ్లోరిడా చేరుకోవడానికి నీటిపై తేలే ఎలాంటి వస్తువు దొరికినా, జనాలు వాటిపైన ఫ్లోరిడా వెళ్లడానికి ప్రయత్నించేవారు'' అని ఈ ఘటన జరిగినప్పుడు హవానాలో దౌత్యవేత్తగా పనిచేసిన క్యూబా చరిత్రకారుడు జువాన్ ఆంటోనియో బ్లాంకో గుర్తుచేసుకున్నారు.
అదే సమయంలో జోస్ బాసుల్టో నేతృత్వంలో మయామిలో క్యూబా ప్రవాసులు 'బ్రదర్స్ టు ది రెస్క్యూ' అనే సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ సభ్యులు విమానాల్లో తిరుగుతూ, తాత్కాలిక పడవల్లో సముద్రం దాటుతున్న క్యూబా వలసదారులను వెతికేవారు.
''మేం వారిని గుర్తించి, ఆ లొకేషన్‌ను అమెరికా కోస్ట్ గార్డ్‌కు చెప్పేవాళ్లం. అప్పుడు కోస్ట్ గార్డ్ వాళ్లను రక్షించేవారు'' అని 'బ్రదర్స్ టు ది రెస్క్యూ' సంస్థ లీడర్, 85 ఏళ్ల బాసుల్టో బీబీసీకి చెప్పారు.
సముద్రంలో ప్రయాణించేవారి కోసం నీరు, ఆహారాన్ని కూడా అందించేవారు. కానీ, కాలక్రమేణా వారు అంతకుమించి చేయడం మొదలుపెట్టారు.
''వాళ్లు ఏం చేస్తామని చెప్పారో, అది చేయడం మానేశారు. వలసదారులను రక్షిస్తామని చెప్పిన వారు అది ఆపేసి క్యూబా గగనతలంలోకి ప్రవేశించి హవానాలో కరపత్రాలను విసిరేయడం ప్రారంభించారు'' అని బీబీసీకి హవానాకు చెందిన పొలిటికల్ సైంటిస్ట్ కార్లోస్ అల్జుగరాయ్ వివరించారు.
ఈ వాయుమార్గ చొరబాట్లను క్యూబా తీవ్రంగా తప్పుపట్టింది. 'బ్రదర్స్ టు ది రెస్క్యూ' సభ్యులను 'ఉగ్రవాదులు'గా పరిగణించింది. వారు జాతీయ భద్రతకు ముప్పుగా మారారని పేర్కొంది.
కానీ, బాసుల్టో వాదన మరోలా ఉంది. .
''వారి దృష్టిలో అది ఉగ్రవాదం కావచ్చు. ఎందుకంటే మేం వేసిన కరపత్రాలలో క్యూబాలో నిషేధించిన 'సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన' ఉంది'' అని బాసుల్టో అన్నారు.
'విమానం నుంచి పొగరావడం నేను చూశాను'
'బ్రదర్స్ టు ది రెస్క్యూ' సంస్థకు చెందిన మూడు సెస్నా విమానాలు 1996 ఫిబ్రవరి 24న జలసంధిపై సాధారణ నిఘా కోసం ఫ్లోరిడా నుంచి బయలుదేరాయి.
వాటిలో రెండింటిని కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే క్యూబా యుద్ధ విమానాలు కాల్చివేశాయి.
ఈ దాడిలో విమానంలో ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారు. అర్మాండో అలెజాండ్రే జూనియర్ (44), కార్లోస్ అల్బెర్టో కోస్టా (29), మారియో మాన్యుయెల్ డి లా పెనా (24), పాబ్లో మోరల్స్ (29) అక్కడికక్కడే చనిపోయారు. పాబ్లో మోరల్స్, క్యూబా పౌరుడు కాగా.. మిగిలిన ముగ్గురూ అమెరికా పౌరులు.
మూడో విమానం మాత్రం ఈ దాడి నుంచి తప్పించుకోగలిగింది. జోస్ బాసుల్టో ఆ విమానానికి పైలట్‌గా ఉన్నారు.
'నేను కుడి వైపుకు చూసినప్పుడు, దూరంలో ఒక విమానం కూలిపోతూ పొగలు రావడం కనిపించింది. నా పక్కనే ఉన్న వలంటీర్ సిల్వియా ఇరియోండో వైపు చూసి, 'తర్వాత వంతు మనదే' అని చెప్పాను' అని నాటి ఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆ సమూహానికి నాయకుడు తానే కాబట్టి వాళ్లు తన విమానాన్నే టార్గెట్ చేయాలనుకున్నారని బాసుల్టో వివరించారు.
క్యూబా జెట్ విమానాల నుంచి వచ్చిన క్షిపణులు ఆ చిన్న పౌర విమానాలను ముక్కలు ముక్కలు చేశాయి. కనీసం వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా మిగలలేదు.
దాడి జరిగినప్పుడు విమానాలు 'హవానాకు ఉత్తరాన అంతర్జాతీయ జలాల్లో' ఉన్నాయని బాసుల్టో నొక్కి చెప్పారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, అమెరికాకు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ కూడా దీనిని ధ్రువీకరించాయి. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకు క్యూబాను తప్పు పట్టాయి.
కానీ క్యూబా ప్రభుత్వం మాత్రం, తాము తమ గగనతలంలోనే ఆ విమానాలను కాల్చివేశామని వాదిస్తూ వచ్చింది.
చరిత్రకారుడు జువాన్ ఆంటోనియో బ్లాంకో దీనిని 'ఫిడెల్ క్యాస్ట్రో పన్నిన కుట్ర'గా అభివర్ణించారు.
'ఆ రోజు ఏ విమానాలు, ఏ రూట్లో ఎగరబోతున్నాయో ఫిడెల్ క్యాస్ట్రోకు ముందే తెలుసు. క్యాస్ట్రో ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు చెందిన ఒక గూఢచారి 'బ్రదర్స్ టు ది రెస్క్యూ' గ్రూపులో ఉన్నాడు' అని ఆయన అన్నారు.
ఈ ఆపరేషన్‌కు ఫిడెల్ క్యాస్ట్రో రాజకీయంగా బాధ్యుడు కాగా, రక్షణ మంత్రి రౌల్ క్యాస్ట్రో ఈ ప్లాన్‌ను అమలు చేశారని బ్లాంకో వ్యాఖ్యానించారు.
తన ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో రౌల్ క్యాస్ట్రో, క్యూబా జర్నలిస్టులకు స్వయంగా వివరిస్తున్న ఒక రికార్డింగ్ 'బ్రదర్స్ టు ది రెస్క్యూ' వెబ్‌సైట్‌లో ఉంచారు.
2006లో లీకైన ఈ రికార్డింగ్ నిజమైనదేనని అమెరికాలో నిపుణులు, జర్నలిస్టులు, అమెరికాలో ప్రవాసంలో ఉన్న క్యూబా మాజీ అధికారులు ధ్రువీకరించారు. అయితే, బీబీసీ దీనిని స్వతంత్రంగా నిర్థరించలేకపోయింది.
క్యూబా ఆ విమానాలను ఎందుకు కూల్చేసింది?
అసలు ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వం ఆ విమానాలను కూల్చివేయాలని ఎందుకు నిర్ణయించుకుందనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.
'బ్రదర్స్ టు ది రెస్క్యూ' సంస్థ పదేపదే వాయుమార్గ చొరబాట్లకు పాల్పడటం వల్ల అది జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని, అందుకే కాల్చి వేయాల్సి వచ్చిందిన క్యూబా సమర్థించుకుంది.
దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికాతో సంబంధాలు మెరుగుపడకుండా అడ్డుకోవడానికే ఫిడెల్ క్యాస్ట్రో ఈ పని చేసి ఉంటారని ఆ సమయంలో అమెరికా - క్యూబా మధ్య అనధికార చర్చల్లో పాల్గొన్న చరిత్రకారుడు బ్లాంకో అభిప్రాయపడ్డారు.
ఈ దాడికి కొన్ని నెలల ముందు, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని.. ఇరు దేశాల సంబంధాలను సరిచేసుకోవడానికి క్యూబా - అమెరికా అధికారులు రహస్యంగా చర్చలు జరిపారని ఆయన వివరించారు.
వాషింగ్టన్‌తో ఎలాంటి సంబంధాలు ఏర్పడినా అది క్యూబాలో రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు దారితీస్తుందని క్యాస్ట్రో భయపడ్డారని బ్లాంకో అన్నారు. అలా జరిగితే తన సంపూర్ణ అధికారానికి ముప్పు తెస్తుందని కాస్ట్రో భావించారని ఆయన వివరించారు.
'విమానాలను కాల్చివేయడం వల్ల, ఆ తర్వాత క్లింటన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది' అని ఆయన చెప్పారు.
దశాబ్దాల పాటు ఇరుదేశాల సంబంధాలను ప్రభావితం చేసిన సంక్షోభం
ఈ సంఘటన కోల్డ్ వార్ తర్వాత క్యూబా, అమెరికా మధ్య అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. 21వ శతాబ్దంలోనూ ఇరుదేశాల సంబంధాల గమనాన్ని మార్చేసింది.
బిల్ క్లింటన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌర విమానాలపై ఆయుధాల వినియోగాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పుపట్టింది.
దీంతో క్యూబాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసింది. అమెరికా చర్యలను తమపై జరిగిన దౌత్యపరమైన దాడిగా క్యూబా భావించింది.
ఈ ఘటన క్యూబా లోపల కూడా ఘోరమైన పరిణామాలకు దారితీసిందని చరిత్రకారుడు బ్లాంకో అన్నారు.
బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి క్యూబా నిరాకరించింది. దీంతో అమెరికాలో ఫ్రీజ్ చేసిన క్యూబా ప్రభుత్వానికి చెందిన 93 మిలియన్ డాలర్ల ఆస్తుల నుంచి ఆయా కుటుంబాలకు అమెరికా నష్టపరిహారం చెల్లించింది.
ఈ ఘటన జరిగి దాదాపు 30 ఏళ్లవుతున్నా... క్యూబాలోనూ, అమెరికాలోని క్యూబా ప్రవాసుల్లో ఇప్పటికీ విపరీతమైన రాజకీయ ప్రాధాన్యతను కలిగి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)